దటీజ్ ధర్మాడి : నేవీ, ఎన్డీఆర్ఎఫ్, టెక్నాలజీ చేయలేనిది సత్యం సాధించారు

Submitted on 22 October 2019
real hero dharmadi satyam

ధర్మాడి సత్యం అనుకున్నది సాధించాడు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. గోదారి గర్భంలో ఇరుక్కుపోయిన బోటును వెలికితీశాడు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, నేవీ బృందాలు తమ వల్ల కాదంటూ  చేతులెత్తేసినప్పుడు నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. బోటును తీస్తానంటూ ధైర్యంగా ప్రకటించాడు. అన్నట్టే విఫలవుతున్న కొద్దీ తన ప్రయత్నాలకు మరింత పదును పెడుతూ.. బోటును బయటకు తీశాడు. 

పెద్ద పెద్ద ప్రమాదాల్లో తమ సేవలను అందించిన నేషనల్‌ డిజాస్టర్‌ టీమ్‌లు సైతం గోదావరి అంతా గాలించి తమ వల్ల కాదంటూ వెళ్లిపోయాయి. సుశిక్షితులైన నేవీ టీమ్‌ కూడా వెనకడుగు వేసి వెళ్లిపోయింది. అంతా  నిరాశ అలుముకున్న క్రమంలో ఎంటరైన ధర్మాడి సత్యం.. బోటును వెలికితీస్తానంటూ ముందుకు వచ్చాడు. టెండర్‌ వేసి.. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాడు. వరదలతో బురదమయమైన రోడ్డుపై తన  సామాగ్రినంతా కచ్చులూరు సమీపానికి అతికష్టమ్మీద చేర్చాడు. వస్తూనే.. గోదావరిలోకి దిగి బోటు జాడను కనిపెట్టాడు.

రెండు ప్లాన్లతో ఆపరేషన్‌ రాయల్‌ వశిష్టను స్టార్ట్‌ చేశారు ధర్మాడి సత్యం. ప్లాన్‌ ఏ, బీ లతో గోదావరిలోకి వెళ్లాడు. బోటును వెలికితీయడమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమించాడు. వరద ఉధృతికి తగినట్టుగా తన ప్లాన్లను  మారుస్తూ బోటు దగ్గరికి చేరాడు. కానీ జోరుగా వానలు కురియడం, పైనుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో మొదటి దశ పనులను ఆపేయాల్సి వచ్చింది. అయితే తన పంతాన్ని మాత్రం వీడలేదు ధర్మాడి. వరద  తగ్గేవరకు ఓపిగ్గా వేచిచూశాడు. గోదారమ్మ కాస్త నెమ్మదించగానే సెకండ్‌ ఫేజ్‌ స్టార్ట్‌ చేశాడు.

రెండోదశ ఆపరేషన్‌లో చాలా తెలివిగా వ్యవహరించారు ధర్మాడి సత్యం. తన బృందం శ్రమతో పాటు.. తనకు డీప్‌ సీ డైవర్స్‌ సాయం తప్పనిసరని గుర్తించారు. అందుకే స్వయంగా తానే విశాఖపట్నం వెళ్లి డైవర్స్‌తో  మాట్లాడి వారిని ఒప్పించారు. అధికారులతో మాట్లాడి అనుమతులు తెచ్చుకున్నారు. ఒక్కసారి డైవర్స్‌ రావడంతోనే సీన్‌ మొత్తం మారిపోయింది. అప్పటివరకు లంగర్లకు తగిలింది బోటా.. రాయా తెలియని పరిస్థితుల్లో  డైవర్స్‌ బోటు ఉందంటూ చెప్పడంతో ధర్మాడి టీమ్‌లో ఉత్సాహం పెరిగింది. వారి సాయం తీసుకొని బోటును ఎట్టకేలకు బయటకు తీసుకురాగలిగాడు ధర్మాడి. 38 రోజులు శ్రమించి గోదావరి గర్భంలో ఉన్న బోటును  ఒడ్డుకు చేర్చాడు.

ధర్మాడి సత్యం ఉన్నత చదువులు చదవలేదు. టెక్నాలజీపై పెద్దగా పట్టు లేదు. అయినా సముద్రం, నదిలో మునిగిపోయిన పడవలు.. బోట్లను వెలికితీయడంలో మాత్రం అపారమైన అనుభవం. ఎక్కడైనా మునిగిపోయిన బోటును వెలికితీయాలంటే తూర్పుగోదావరి జిల్లా వాసులకు ముందుగా గుర్తొచ్చే పేరు ధర్మాడిదే. సత్యం బృందం అడుగుపెట్టిందంటే ఆపరేషన్ సక్సెస్ కావాల్సిందే. కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీయడంతో ధర్మాడి సత్యం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.

dharmadi satyam
operation royal vasista
BOAT
extraction
NDRF
navy
Godavari

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు