హైదరాబాద్ లో హోర్డింగ్స్ పై నిషేధం

Submitted on 12 June 2019
As rains knock on door, GHMC bans hoardings till August 15

వర్షాకాలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు హోర్డింగ్స్, బిల్ బోర్డ్స్, యూనిపోల్స్ విరిగిపడంతో పలువురు మృతి చెందారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రస్తుతం వర్షాకాల సీజన్ దృష్టిలో పెట్టుకుని జీహెచ్ ఎంసీ అన్ని రకాల హోర్డింగ్స్ ను రెండు నెలలపాటు నిషేధించింది. (జూన్ 15, 2019) నుంచి (ఆగస్టు 15, 2019) వ తేదీ వరకు నిషేధిస్తూ జీహెచ్ ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంగళవారం (జూన్ 11, 2019) జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో స‌మావేశంలో నిర్వహించిన ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్ర‌స్తుత వ‌ర్షకాల సీజ‌న్‌తో పాటు ఆక‌స్మికంగా సంభ‌వించే విప‌త్తుల‌ను ఎదుర్కునేందుకు వివిధ శాఖ‌లు మ‌రింత స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని ప‌లు శాఖ‌ల ఉన్న‌తాధికారులు నిర్ణ‌యించారు. వ‌ర్షాకాలంలో ఈదురుగాలులతో కూడిన వ‌ర్షాలు కురిసి హోర్డింగ్‌లు, యూనిఫోల్స్ కూలిపోయి ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉన్నందున జూన్-15,2019 నుండి ఆగ‌ష్టు-15, 2019 వ‌ర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని అన్ని ర‌కాల హోర్డింగ్‌లను నిషేధిస్తున్న‌ట్టు ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. 


ఈ స‌మావేశంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, మెట్రో రైలు, విద్యుత్, ఇత‌ర‌ విభాగాల వ‌ద్ద అన్ని క‌లిపి దాదాపు 300 విప‌త్తుల నివార‌ణ ప్ర‌త్యేక‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయ‌ని చెప్పారు. హైదరాబాద్ న‌గ‌రంలో ఎలాంటి విప‌త్తులు ఎదురైనా అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి న‌గ‌ర‌వాసుల్లో విశ్వాసం నింపాల‌ని దాన కిషోర్ పేర్కొన్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలో ప్ర‌ధానంగా 195 కేంద్రాల‌ను నీటిముంపు ప్రాంతాలుగా గుర్తించామ‌న్నారు. వ‌ర్షాల స‌మ‌యంలో ఈ ప్రాంతాలపై ప్ర‌త్యేక దృష్టిని సాధిస్తున్న‌ట్టు దాన‌కిషోర్ తెలిపారు. ముఖ్యంగా ముంపుకు గుర‌య్యే 195 కేంద్రాల వ‌ద్ద మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌ల‌ను మ‌రోసారి త‌నిఖీలు నిర్వ‌హించి ఆయా నాలాల్లో ఏవిధ‌మైన పూడిక‌, వ్య‌ర్థాలు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో వివిధ ఏజెన్సీలకు గ‌తంలో జారీచేసిన రోడ్డు త‌వ్వ‌కాల‌కు సంబంధించి ఆయా రోడ్ల నిర్మాణ ప‌నుల‌ను వారం రోజుల్లోగా పూర్తిచేయాల‌ని కమిష‌న‌ర్ దాన‌కిషోర్ ఆదేశించారు. రోడ్లు త‌వ్వి పున‌రుద్ద‌ర‌ణ చేయ‌ని ఏజెన్సీల‌పై చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. 

మెట్రో రైలు మార్గంలో ఉన్న అన్ని హోర్డింగ్‌ల‌పై నిషేదం విధించ‌డం జ‌రిగింద‌ని, కొన్ని హోర్డింగ్‌ల‌పై అక్ర‌మంగా ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేస్తున్నార‌ని జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ అద్వైత్‌కుమార్ సింగ్ చెప్పారు. ఈ మెట్రో మార్గంలో ఉన్న హోర్డింగ్‌ల‌ను తొల‌గించాల‌ని సంబంధిత ఏజెన్సీల‌ను ఆదేశించామ‌ని తెలిపారు. 

హైద‌రాబాద్ మెట్రో రైలు మార్గంలో 95 హోర్డింగ్‌లు ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని హైద‌రాబాద్ మెట్రోరైలు ఎండి ఎన్‌.వి.ఎస్ రెడ్డి తెలిపారు. హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని ర‌హ‌దారుల‌పై 150 కేంద్రాల్లో రోడ్ల మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని ట్రాఫిక్ విభాగం అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ అనీల్ కుమార్ సూచించారు. మెట్రో రైలు వంతెన‌ల‌పై నుండి వ‌ర్ష‌పునీరు రోడ్ల‌పైకి ప్ర‌వ‌హిస్తున్నాయని, వీటిని నివారించాల‌న్నారు. 
 

Rains
GHMC
bans
hoardings
August 15
Hyderabad

మరిన్ని వార్తలు