వెదర్ అప్ డేట్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

Submitted on 15 September 2019
rain alert for andhra pradesh

నైరుతి రుతు పవనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు.. వీటి ప్రభావంతో ఏపీలో వర్షాలే వర్షాలు. విస్తారంగా వానలు పడనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. అక్టోబర్‌ మూడో వారం వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన వారాంతపు నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. రాబోయే రెండు, మూడు వారాల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పింది.

ఎల్‌నినో తటస్థంగా ఉంది. పసిఫిక్‌ మహా సముద్ర ఉష్ణోగ్రతలు, మధ్య పసిఫిక్‌ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇవి రుతు పవనాల కాల పరిమితిని పెంపొందిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు హిందూ మహాసముద్రంలో ధ్రువపు పరిస్థితులు నైరుతికి అనుకూలంగా ఉన్నాయి. ఇవన్నీ నైరుతి రుతు పవనాల కొనసాగింపునకు దోహదపడుతున్నాయనీ.. ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోనూ విరివిగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. రుతు పవనాలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా సెప్టెంబర్ మూడో వారం నుంచి దక్షిణ భారత దేశంలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. 

మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తు వరకు ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఉంది. దీనికి తోడు.. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులూ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు యానాంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. గడిచిన 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

rain alert
Andhra Pradesh
pressure
IMD

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు