హుజూర్‌నగర్‌లో ముగిసిన పోలింగ్ : 85 శాతానికి పైగా పోలింగ్‌

Submitted on 21 October 2019
Polling ended in Huzurnagar

హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానంలో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 85శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల పరిధిలో పోలింగ్‌ జరిగింది. హుజూర్‌నగర్‌, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. లైన్ లో వేచిఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కొన్ని చోట్ల మాత్రం మొదట ఈవీఎంలు మొరాయించాయి. ఎన్నికల అధికారులు వెంటనే వాటిని సరిచేశారు. అక్టోబర్ 24న హుజూర్‌నగర్ బైపోల్ ఫలితం వెలువడనుంది.

ఈ ఉప ఎన్నికలో ముగ్గురు మహిళలు సహా 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ మధ్యే కొనసాగింది. టీఆర్‌ఎస్‌ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పద్మావతిరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావు బరిలో నిలిచారు. 85 శాతం పోలింగ్ ఏ పార్టీకి ప్లస్ అవుతుంది.. ఎవరికి మైనస్ అవుతుందన్న దానిపై.. రకరకాల ప్రచారం జరుగుతోంది. హుజూర్‌నగర్‌ బైపోల్‌లో.. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది పోటీ చేశారు. వీరందరి భవితవ్యం.. ఈవీఎంల్లో భద్రంగా నిక్షిప్తమై ఉంది. పోలింగ్ పూర్తిగా ముగిశాక.. ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించనున్నారు ఎన్నికల అధికారులు. 

దాదాపు అన్ని పార్టీలు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని టీఆర్‌ఎస్‌ సర్వశక్తులూ ఒడ్డగా... తమ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా కృషి చేసింది. మరోవైపు టీడీపీ, బీజేపీ సైతం పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే టీడీపీ, బీజేపీ అభ్యర్థులు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో ఎవరి ఓట్లను చీల్చారనే దానిపై విజయావకాశాలు ఆధారపడే అవకాశముంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఈసారి ప్రజలు తమకు పట్టంకడతారని టీఆర్‌ఎస్‌ భావిస్తుండగా.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మళ్లీ తమను గెలిపిస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈనెల 24న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.

హుజూర్‌నగర్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 86.95 శాతం పోలింగ్‌ నమోదైంది. అప్పట్లో లక్షా 92 వేల 218 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 92 వేల 996 ఓట్లు రాగా... టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి 85 వేల 530 ఓట్లు వచ్చాయి. 7 వేల 466 ఓట్ల తేడాతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఉత్తమ్‌... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది.
 

by elections
polling
end
Huzurnagar

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు