కర్నాటకలో పొలిటికల్‌ హైడ్రామా : నేడు బల పరీక్ష

Submitted on 23 July 2019
Political Hydrama in Karnataka

కర్నాటకలో బల పరీక్ష డ్రామాకు అంతూపొంతూ లేకుండా పోతోంది. గవర్నర్‌ డెడ్‌లైన్లు పెట్టినా పట్టించుకోని స్పీకర్‌ రమేష్‌కుమార్‌... సోమవారం కూడా విశ్వాస పరీక్షను ముగించలేకపోయారు. పాలక, ప్రతిపక్షాల వాదోపవాదాల నడుమ విశ్వాస తీర్మానంపై చర్చను ఇవాళ్టికి వాయిదా వేశారు. సాయంత్రంగా 6 గంటలకల్లా బల పరీక్షను పూర్తి చేస్తామని స్పీకర్‌ ప్రకటించారు.

ఘడియకో మలుపు తిరిగిన కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరపడలేదు. క్షణక్షణం ఉత్కంఠ రేపిన బలపరీక్ష వ్యవహారం నిన్న అర్ధరాత్రి అయినా ఎటూ తేలకపోవడంతో విధానసభ నేటికి వాయిదా పడింది. సాయంత్రం 4గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని స్పీకర్‌ రమేశ్ కుమార్‌ అధికార పక్షానికి డెడ్‌లైన్‌ విధించారు. కాంగ్రెస్‌ తరఫున కొంతమంది మాట్లాడాల్సి ఉందని... రాత్రి 8గంటల వరకు సమయం ఇవ్వాలని సిద్ధరామయ్య కోరగా... అందుకు సాధ్యం కాదని స్పీకర్‌ తేల్చి చెప్పారు. దీంతో ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు చర్చను ముగించి.. సాయంత్రం 6గంటలకు విశ్వాస పరీక్షను నిర్వహిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దీంతో సభను స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ ఇవాళ్టికి వాయిదా వేశారు.

సంకీర్ణ పక్షం ఎమ్మెల్యేల రాజీనామాలతో కన్నడ రాజకీయాల్లో పెను సంక్షోభం తలెత్తింది. రెండ్రోజుల విరామం తర్వాత... తిరిగి నిన్న ప్రారంభమైనప్పటికీ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని అధికార పక్షం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజే నిర్వహించాలని విపక్షం పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎంత రాత్రయినా సభలోనే ఉంటాం.. బల నిరూపణ పూర్తిచేయాల్సిందేనని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప పట్టుబట్టగా.. ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారాన్ని తేల్చకుండా బలనిరూపణ ఏంటని సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు బలపరీక్ష నిర్వహించవద్దని ఆయన స్పీకర్‌ను కోరారు. అధికార పార్టీ సభ్యులు సభను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు.

కర్ణాటకలో మూడు వారాల క్రితం అధికార కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో మొదలైన రాజకీయ సంక్షోభం.. గత వారం కుమారస్వామి అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో తారాస్థాయికి చేరింది. ఈ తరుణంలో గత వారంలో రెండ్రోజుల పాటు చర్చించిన విధానసభ ఏ నిర్ణయం లేకుండానే వాయిదా పడి తిరిగి సోమవారం ప్రారంభమైంది. స్పీకర్‌ ఎట్టిపరిస్థితుల్లో నిన్న విశ్వాస పరీక్ష నిర్వహించాలని ప్రయత్నించినా చివరకు సభలో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఆయన సభను ఇవాళ్టికి మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది.
 

Political Hydrama
karnataka
CM Kumaraswamy

మరిన్ని వార్తలు