టికెట్ రేటు కన్నా ఎక్కువ వసూలు : ఇద్దరు కండక్టర్లపై 420 కేసు

Submitted on 10 October 2019
police case on conductors

నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో టికెట్ రేటు కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఇద్దరు కండక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం(అక్టోబర్ 10,2019) జిల్లా ఎస్పీ రంగనాథ్ నార్కట్ పల్లి బస్టాండ్ లో బస్సుల రాకపోకలను పరిశీలించారు. బస్సుల్లోకి వెళ్లి ఎంత ఛార్జీ తీసుకుంటున్నారని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అసలు ధర కంటే ఎక్కువగా వసూలు చేశారని ప్రయాణికులు చెప్పడంతో ఆయన సీరియస్ అయ్యారు. రెండు డిపోలకు చెందిన ఇద్దరు కండక్టర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. 

యాదగిరిగుట్ట డిపో కండక్టర్ రామాంజనేయులు, ఖమ్మం డిపో కండక్టర్ నాగేశ్వరరావుపై పోలీసులు 420 కేసులు నమోదు చేశారు. భువనగిరి నుంచి నల్గొండ వెళ్లే బస్సులో అసలు టికెట్ ధర రూ.65. కాగా ఒక్కో ప్రయాణికుడి దగ్గర రూ.75 వసూలు చేశారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులోనూ అధిక ఛార్జీలు వసూలు చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దృష్టి పెడుతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రయాణికులకు మంత్రి సూచించారు. ఆయా రూట్లలో ఉండే ఛార్జీల పట్టికను ప్రతి బస్సులోనూ ఉంచుతామన్నారు. దీని కోసం ప్రతి డిపోలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి డీఎస్పీ స్థాయి అధికారిని ఇంఛార్జ్ గా నియమిస్తున్నట్లు చెప్పారు.

మంత్రి హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఇద్దరు కండక్టర్లపై పోలీసు కేసు నమోదు కావడం విశేషం. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే ఈ బస్సుల్లో టికెట్ ధర కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. టికెట్ రేటు కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోవద్దని సిబ్బందికి తేల్చి చెప్పింది.

TSRTC
conductors
police case
ticket rate
narkatpally
nalgonda

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు