కేంద్రం నిర్ణయం : వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ

Submitted on 19 June 2019
PM Modi to Set Up Committee on One Nation, One Election


జమిలి ఎన్నికలపై కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కమిటీలో అన్ని రాజకీయ పక్షాలు, ఈసీ సభ్యులు ఉంటారని చెప్పారు. అధ్యయనం, చర్చల తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. జమిలి ఎన్నికలపై అఖిలపక్ష భేటీకి 40 పార్టీలను ఆహ్వానిస్తే.. 24 పార్టీలు మాత్రమే పాల్గొన్నాయని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఇది ప్రభుత్వ ఎజెండా కాదని దేశ ఎజెండా అని.. ఇది అన్ని పార్టీలు దృష్టిలో ఉంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. 

రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మరోసారి ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చింది. లోక్ సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలు జరపాలనే దిశగా పార్టీలతో సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం(జూన్ 19,2019) అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. నాలుగు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత జగన్.. జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించారు. జ‌మిలి ఎన్నిక‌ల విధానానికి ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ సైతం ఓకే చెప్పేశారు. వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్ విధానాన్ని స‌మ‌ర్థించారు. రాజ్యాంగంలో అహింసను కూడా జోడించాల‌ని ప‌ట్నాయ‌క్ సూచించారు. పార్ల‌మెంటుతో పాటు అసెంబ్లీలో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఒడిశాకు ప్ర‌త్యేక హోదా ఇవ్వాలన్నారు. 

ఎంఐఎం, సీపీఐ, సీపీఎం పార్టీలు మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల వల్ల రాజ్యాంగ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అకాలీదళ్ నేత బాదల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీయూ నేత నితీశ్ కుమార్, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, వైసీపీ అధినేత జగన్, సీపీఐ నేతలు డి.రాజా, సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత సీతారాం ఏచూరీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ లీడర్ మెహబూబా ముఫ్తీ సహా 24 పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. 

PM Modi to Set Up Committee on One Nation
One Election

మరిన్ని వార్తలు