టీడీపీలానే వైసీపీ దెబ్బతింటుంది : పార్టీ కేడర్ కోసమే వాలంటీర్ ఉద్యోగాలు

Submitted on 14 September 2019
pawan kalyan warns cm jagan

ఏపీ సీఎం జగన్‌ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ రిపోర్ట్‌ విడుదల చేసింది. 9 అంశాలపై 33 పేజీలతో కూడిన బుక్ లెట్ ను విడుదల చేశారు జనసేనాని పవన్. ''పారదర్శకత దార్శనికత లోపించిన వైసీపీ 100 రోజుల పాలన'' అనే పేరుతో ఈ బుక్ లెట్ ను తీసుకొచ్చారు. జగన్ పాలనపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించాయన్నారు. ఇసుక విధానం, పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం చెప్పినా వినకుండా పీపీఏలు రద్దు చేసి గందరగోళం సృష్టించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రజారోగ్యం పడకేసిందన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయని, స్కూల్స్ లో మౌలిక వసతులు లేవని పవన్ అన్నారు. అందరినీ బెదిరిస్తుంటే పెట్టుబడులు ఎవరు పెడతారని పవన్ ప్రశ్నించారు.

రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదని పవన్ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలుంటే సరిచేయాలని సూచించారు. టీడీపీని జన్మభూమి కమిటీలు దెబ్బతీసినట్టే వైసీపీని గ్రామ వాలంటీర్ల వ్యవస్థ దెబ్బతీస్తుందని పవన్ హెచ్చరించారు. వైసీపీ కేడర్‌ కోసమే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. అమరావతి.. ఏపీ రాజధాని అని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ తీసుకురావాలని పవన్ చెప్పారు. ఏపీలో నైతికత లేని రాజకీయాలు చేస్తున్నారని పవన్ ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులు మాటలు మార్చడం వల్లే రాష్ట్రం విడిపోయిందన్నారు. ఓటమి వల్ల జనసేన పార్టీ బలహీనపడలేదని చెప్పారు. జగన్ పాలన ప్రణాళికాబద్దంగా లేదని పవన్ విమర్శించారు. మూడున్నర నెలల్లోనే జగన్ నిర్ణయాలు ప్రజల్లో ఆందోళన నింపాయన్నారు. ఏడాది వరకు మాట్లాడే అవకాశం రాదని అనుకున్నాము.. కానీ 100 రోజుల్లోనే మాట్లాడాల్సి వచ్చిందన్నారు. సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలను పవన్ ప్రశంసించారు. నవరత్నాలు జనరంజకమైనవే అని అంగీకరించారు. అయితే పాలన మాత్రం జన విరుద్ధంగా ఉందని పెదవి విరిచారు.

టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇసుక మాఫియనే అని పవన్ చెప్పారు. ఇసుకను రూ.375 అని చెప్పి రూ.900 వసులూ చేస్తున్నారని ఆరోపించారు. రూ.525 ప్రభుత్వానికి చేరుతున్నాయో లేదో తెలియడం లేదన్నారు. ఇసుక మాఫియాని ఆపుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. రాష్ట్రంలో ఇసుకే లేకుండా చేసిందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి రూ.2.58 లక్షల కోట్ల అప్పు ఉందని పవన్ తెలిపారు.

Also Read : 100 రోజుల పాలనలో జగన్ చేసిన మంచి పని ఇదొక్కటే

Pawan kalyan
janasena
cm jagan
book let
100 days palana
volunteer jobs
Sand Mafia

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు