pawan kalyan reaction on nagababu controversy comments

అన్నకు తమ్ముడి షాక్, నాగబాబు ట్వీట్లపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో చేస్తున్న పలు ట్వీట్లు వివాదానికి దారితీశాయి.

మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో చేస్తున్న పలు ట్వీట్లు వివాదానికి దారితీశాయి. నాగబాబుపై విమర్శలు వస్తున్నాయి. మొన్న గాడ్సేను ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన నాగబాబు.. తాజాగా కరెన్సీ నోట్లపై కామెంట్ చేశారు. ముఖ్యంగా జాతిపిత మహాత్మా గాంధీని టార్గెట్‌ చేసినట్లుగా నాగబాబు వ్యాఖ్యలు ఉండటంతో.. గాంధేయవాదులు విరుచుకుపడ్డారు. నాగబాబు తన ప్రవర్తన మార్చుకోవాలని కొందరు రాజకీయ నేతలు కూడా హితవు పలికారు. కాగా నాగబాబు జనసేన నేత కావడంతో, జనసేన పార్టీ ఇరకాటంలో పడింది. జనసేన పార్టీది కూడా అదే అభిప్రాయం ఏమో అనే సందేహాలు ఇటు ప్రజల్లో అటు రాజకీయవర్గాల్లో మొదలయ్యాయి. ఈ వ్యవహారం జనసేనలోనూ ప్రకంపనలు రేపింది. ఈ విషయం జనసేనాని పవన్ కు చేరిందో మరో కారణమో కానీ.. నాగబాబు వివాదాస్పద ట్వీట్ల పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగబాబు వ్యాఖ్యలతో పార్టీకి డ్యామేజ్ కలగకుండా ఉండేలా పవన్ రియాక్ట్ అయ్యారు.

నాగబాబు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం, పార్టీతో సంబంధం లేదు:
వ్యక్తిగత అభిప్రాయాలతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పవన్‌ స్పష్టం చేశారు. గత మూడు రోజులుగా నాగబాబు చేస్తున్న వివాదాస్పద పోస్టులు కూడా ఆయన వ్యక్తిగతమైనవని, వీటితో జనసేన పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కరోనా కష్ట కాలంలో ప్రజాసేవ ద్వారా ఎటువంటి అంశాల జోలికి వెళ్ల వద్దని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ మేరకు శనివారం(మే 23,2020) పవన్‌ కల్యాణ్‌ ఓ లేఖను విడుదల చేశారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో ఇతర అంశాల జోలికెళ్లొద్దు:
‘జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న కార్యకర్తలు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ.. పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నా. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని చెప్పా. ఈ మధ్య కాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన కొందరు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్‌ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికారిక పత్రం ద్వారా మాత్రమే వెల్లడిస్తాం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్పమరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలను కోరుతున్నా. ఎవరూ క్రమశిక్షణను అతిక్రమించొద్దు” అని లేఖలో కోరారు పవన్ కళ్యాణ్.

ట్వీట్లతో కాక రేపుతున్న నాగబాబు:
కాగా మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే దేశ భక్తుడంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే శనివారం ఆయన మరో పోస్ట్‌ చేశారు. ‘భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్‌ చంద్రబోస్‌, అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, లాల్‌ బహదూర్‌, పీవీ నరసింహారావు, అబ్దుల్‌ కలాం, సావర్కార్‌, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉందంటూ కొత్త వివాదానికి తెర లేపారు. వివాదాస్పద ట్వీట్లతో సోషల్‌ మీడియా వేదికగా అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నాగబాబు పోస్టులతో జనసేనకు సంబంధం లేదని పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇచ్చారు.

తమ్ముడు చెప్పినట్టు అన్న నడుచుకుంటాడా?
మొత్తంగా మెగా బ్రదర్ నాగబాబు దెబ్బకి పవన్ ఈ విధంగా వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజా సేవ తప్ప ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని జన సైనికులకు పవన్ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. మరి, పవన్ రిక్వెస్ట్ తో అయినా నాగబాబు మారతాడా? తమ్ముడు చెప్పిన మాట విని అన్న సైలెంట్ అవుతాడా? జనసేన పార్టీకి నష్టం కలగకుండా వ్యవహరిస్తారా? లేక అంతా నాయిష్టం అని మరింత రెచ్చిపోతారా? నాగబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read:  కరెన్సీ నోట్లపై అంబేద్కర్, సావర్కర్, పీవీ నరసింహారావు చిత్రాలు చూడాలని ఉంది:నాగబాబు