భారతీయుల విజయం : అయోధ్య తీర్పుపై పవన్

Submitted on 9 November 2019
pawan kalyan reaction on ayodhya verdict

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చరిత్రాత్మకమైనదని చెప్పారు. భారత న్యాయవ్యవస్థకున్న పరిపూర్ణమైన జ్ఞానానికి ఈ తీర్పు అద్దం పడుతుందని కొనియాడారు. భారతీయులమంతా కోర్టు తీర్పును హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నామని వెల్లడించారు. ధర్మాన్ని సమర్థించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపిన పవన్... భారత్ మాతా కీ జై అంటూ ట్వీట్‌ను ముగించారు.

శనివారం(నవంబర్ 9,2019) అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని వెల్లడించింది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. 

మసీదుకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని కోర్టు సూచించింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ఏకగ్రీవ తీర్పుని ఇచ్చింది.

అయోధ్య తీర్పు తర్వాత దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. దేశం మొత్తం సుప్రీం తీర్పుని స్వాగతించిందని చెప్పారు. దేశ ప్రాచీన సంస్కృతి, సామాజిక సామరస్యం, సాంప్రదాయానికి రుజువు అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదానికి ఈ తీర్పు నిదర్శనమన్నారు. దేశంలో వ్యతిరేక భావజాలాన్ని కొత్తతరం స్వాగతించే పరిస్థితి లేదన్నారు మోడీ. సుప్రీంకోర్టు బలమైన విల్ పవర్ చూపిందన్నారు. అతిక్లిష్టమైన అంశాలను రాజ్యాంగ పరిధిలో పరిష్కరించగలమని సుప్రీం చాటిచెప్పింది. రామమందిరాన్ని నిర్మించాలని సుప్రీం తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజని మోడీ అన్నారు.

ayodhya verdict
Pawan kalyan
Reaction
Tweet

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు