80ఏళ్ల పోరాటం : శ్రీవారికి వెయ్యి కోట్ల విలువైన భూమి వచ్చింది

Submitted on 7 September 2019
After 80 year legal battle, ttd gets back land

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చేసిన 80 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించింది. టీటీడీకి చెందిన 188 ఎకరాల ఆలయ భూమి తిరిగి దక్కించుకుంది. ఈ భూములు విలువ వెయ్యి కోట్లు. 1940 నుంచి భూముల  కోసం టీటీడీ న్యాయ పోరాటం చేస్తోంది. తిరుపతి ప్రధాన బస్టాండ్ పక్కన 188 ఎకరాల 32 సెంట్ల ఆలయ భూమి ఉంది. ఆ భూమి తమదేనని ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్య వారసులు, గురువారెడ్డి అనే రాజకీయ నేత కుటుంబసభ్యులు వాదించారు. చివరికి విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు అసలు నిజం ఏంటో తేల్చారు. ఆ భూములపై సర్వహక్కులు టీటీడీవే అని స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే.. అన్నమాచార్య సేవలను అభినందిస్తూ టీటీడీ అధికారులు.. ఇనామ్(కానుక) కింద 188 ఎకరాల 32 సెంట్ల భూమిని ఇచ్చారని.. అన్నమాచార్య వంశానికి చెందిన వారు వాదించారు. అయితే 1925లో తాళ్లపాక వంశస్తులు టీటీడీకి అందిస్తున్న సేవలను నిలిపివేశారు. కానీ భూమిని వెనక్కి ఇవ్వలేదు. అంతేకాదు.. ఆ భూమిని వారు సుబ్బారెడ్డి, గురువా రెడ్డి అనే వ్యక్తులకు లీజు కింద ఇచ్చేశారు. గురువా రెడ్డి రాజకీయ నేత. తిరుపతి ఎమ్మెల్యేగా పని చేశారు. 1927లో గురువారెడ్డి భూమి పత్రాలను తీసుకుని తన కుటుంబసభ్యులు పేరు మీద రిజిస్ట్రర్ చేయించారు. రెవెన్యూ శాఖ నుంచి పట్టా కూడా పొందారు. 

1940లో దీనిపై టీటీడీ సబ్ కలెక్టర్ ని ఆశ్రయించింది. ఆ భూమి టీటీడీదేనని సబ్ కలెక్టర్ నిర్ధారించారు. అయినా గురువారెడ్డి కుటుంబసభ్యులు వినలేదు. దీంతో భూవివాదం అనేక ఏళ్లుగా నడిచింది. తాళ్లపాక వంశానికి చెందినవారు సీసీఎల్ ఏ కమిషనర్ ని కలిశారు. దీనిపై విచారణ జరిపించాలని చిత్తూరు ఇనామ్స్ డిప్యూటీ తహసీల్దార్ ని కమిషనర్ ఆదేశించారు. పూర్తి విచారణ జరిపిన తర్వాత ఆగస్టు 27న చిత్తూరు ఇనామ్స్ డిప్యూటీ తహసీల్దార్ తీర్పు ఇచ్చారు. ఆ భూములపై తాళ్లపాక కుటుంబసభ్యులకు కానీ గురువారెడ్డి కుటుంబసభ్యులకు కానీ ఎలాంటి హక్కులు లేవన్నారు. ఆ భూములకు నిజమైన ఓనర్ టీటీడీ అని స్పష్టం చేశారు. అది టీటీడీ ఆస్తి అని చెప్పారు.

''విచారణ తర్వాత తేలిందేమిటి అంటే.. ఆ భూములపై సర్వ హక్కులు టీటీడీకి ఉన్నాయి. రెవెన్యూ కోర్టులు/ఇనామ్స్ డిప్యూటీ తహసీల్దార్ చిత్తూరు, సబ్ సెక్షన్ (4), (3), ఏపీ ఇనామ్స్ సెక్షన్ (3) 1956 యాక్ట్ కింద.. 188 ఎకరాల భూమి టీటీడీకి చెందుతాయని తేల్చడం జరిగింది'' అని తీర్పు ఇచ్చారు. దీంతో టీటీడీ చేసిన 80 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలించింది. భూములు తిరిగి సొంతం అయ్యాయి.

TTD
LAND
188 acres
Legal Battle
Tirumala

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు