అల్పపీడనం : రెండు రోజులు భారీ వర్షాలు

Submitted on 22 August 2019
rain alert for telangana

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని చోట్ల భారీగా, కొన్ని చోట్ల మోస్తరు వాన కురుస్తుందని తెలిపింది. తూర్పు యూపీ, దాన్ని ఆనుకుని ఉన్న బీహార్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా కంటిన్యూ అవుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజులు తెలంగాణలో చాలా చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

గురువారం(ఆగస్టు 22,2019) ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం(ఆగస్టు 21,2019) సాయంత్రం రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు మండలం మాచర్లలో అత్యధికంగా 8 సెమీ వర్షం పడింది. జగిత్యాల, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, సూర్యాపేట, జనగాం, కామారెడ్డి, మంచిర్యాల, నారాయణపేట, నిర్మల్, వరంగల్‌ రూరల్, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

రాష్ట్రంలో వరి నాట్లు జోరుగా పడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఈ ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.83 లక్షల ఎకరాలు. ఇప్పటివరకు 19.47 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గత వారంతో చూస్తే 5లక్షల ఎకరాల వరినాట్లు అధికంగా పడినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడించింది. రానున్న వారం పది రోజుల్లో వంద శాతం అంచనాలు దాటి వరినాట్లు పడతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.

rain alert
Telangana
low pressure
Hyderabad
Bay of Bengal

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు