No Domestic Flights In Andhra Pradesh Chandrababu who went in the car to Undavalli

ఏపీకి బాబు : విమానాలు ఎగరలేదు..కారులో ఉండవల్లికి పయనం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి ఏపీకి బయలుదేరారు. రాష్ట్రంలో విమానాల ప్రారంభం రెండు రోజుల పాటు జాప్యం కావడంతో ఆయన విశాఖ వెళ్లలేకపోయారు. విశాఖ పర్యటన వాయిదా పడిన  నేపథ్యంలో.. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు పయనమయ్యారు. తొలుత హైదరాబాద్‌ నుంచి విమానంలో విశాఖపట్నం వెళ్లేందుకు.. అక్కడి నుంచి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు వీలుగా ఆయన షెడ్యూల్‌ నిర్ణయించుకున్నారు. 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాలకు అమరావతి నుంచే హాజరుకానున్నారు. మంగళగిరి  సమీపంలోని ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి మహానాడు సందేశమివ్వనున్నారు.   

హైదరాబాద్ లో ఇంటికే పరిమితం : –
మార్చి 20 నుంచి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోనే ఉన్నారు. మార్చి 24న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం, ఆ తర్వాత వరుసగా లాక్ డౌన్‌ను కొనసాగించడంతో చంద్రబాబు హైదరాబాద్‌లో ఇంటికే పరిమితం అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు బాధితులను పరామర్శించేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయానికి లేఖ  కూడా రాశారు. అయితే అప్పుడు పర్మిషన్ రాలేదు.. మరోవైపు కరోనా కష్టకాలంలో చంద్రబాబు చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండటంపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేశారు. 

ఏపీ పోలీసు శాఖ అనుమతి : –
చంద్రబాబు విశాఖపట్నం పర్యటనకు ఏపీ పోలీసు శాఖ అనుమతిచ్చింది. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చేందుకు ఈ-పాస్‌ జారీ  చేసింది. ఈ మేరకు చంద్రబాబు చేసుకున్న దరఖాస్తును ప్రత్యేక కేసుగా కింద పరిగణించి అనుమతి ఇస్తున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు ఏపీలోని  ఆయన క్యాంపు కార్యాలయం లేదా నివాసానికి చేరుకోవాల్సి ఉన్నందున అనుమతిస్తున్నట్లు ఈ-పాస్‌లో స్పష్టం చేశారు. నిత్యావసర సేవల విభాగం కింద ఈ-పాస్‌ జారీ చేశారు. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు  లోకేశ్‌, పీఏ శ్రీనివాస్‌ ఏపీకి వచ్చేందుకు అనుమతిచ్చారు.   

మార్గదర్శకాలు ఫాలో కావాలన్న AP DGP : –
కరోనా నియంత్రణకు సంబంధించి అమల్లో ఉన్న జాతీయ మార్గదర్శకాలు పాటించాలని లేఖలో డీజీపీ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్న వారికి వైద్యారోగ్య శాఖ ప్రోటోకాల్‌ ప్రకారం ఎప్పటికప్పుడు పరీక్షలు  నిర్వహించాలని.. నెగిటివ్‌ అని తేలిన తర్వాత వారిని హోం క్వారంటైన్‌కు పంపించాలని డీజీపీ లేఖలో స్పష్టం చేశారు. నిత్యావసర సేవలు పొందేందుకు లేదా ఆరోగ్యపరమైన సమస్యలకు చికిత్స తీసుకోవాల్సిన  అవసరముంటే 65 ఏళ్లు పైబడిన వారు.. 10 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణిలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఇంట్లోనే ఉండాలని.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ వ్యక్తులు బయటకు రావటం కూడా నిషేధమని.. కరోనా నియంత్రణకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొంటూ.. ఆ వివరాలను లేఖలో డీజీపీ ప్రస్తావించారు.   
విమాన సర్వీసులు నిలిపివేయడంపై టీడీపీ విమర్శలు : –
ఇక చంద్రబాబు విశాఖ పర్యటనకు అనుమతిచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులు నిలిపివేయటం వైసీపీ ప్రభుత్వ కుట్రేనని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకే సోమవారం ఏపీకి వెళ్లాల్సిన  సర్వీసులను రద్దు చేశామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ట్వీట్‌ చేయటమే దీనికి నిదర్శనమని ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వ చర్యలపై ధ్వజమెత్తారు.   

Read: ఏపీలో విమానాశ్రయాలు మూసివేత : బాబు విశాఖ టూర్ క్యాన్సిల్!