అరవిందా...బోర్డు తిప్పేశావా : పసుపు బోర్డు మాట మరిచారా

Submitted on 11 July 2019
Nizamabad Farmers Fires On BJP MP Dharmapuri Arvind Over Turmeric Board

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాట మరిచిపోయారు. రాసిచ్చిన ఒప్పందాన్ని గాలికొదిలేశారు. గెలిచిన ఐదురోజుల్లోనే పసుపు బోర్డ్....లేదంటే రిజిగ్నేషన్...అన్నారు ఆనాడు. గెలిచిన తర్వాత ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఊసెత్తడం లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో పసుపు బోర్డు ప్రస్తావనే లేకపోవడంతో నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఎంపీ అరవింద్ కనిపిస్తే కడిగిపారేస్తామంటున్నారు. 

దేశంలో అత్యధికంగా పసుపు పండిస్తున్న నిజామాబాద్ రైతులు బోర్డు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. రైతుల ఆందోళన కారణంగా ఎన్నికల ఫలితాలే మారిపోయాయి. పసుపు బోర్డు వాగ్దానం చేసిన ధర్మపురి అరవింద్ 5 రోజుల గడువు పెట్టారు. అంతటితో ఆగకుండా అగ్రిమెంట్ పత్రం విడుదల చేసి రైతులకు మాట ఇచ్చారు కూడా.

పసుపుకు కనీస మద్దతు ధర లేకపోవడం, దేశవ్యాప్తంగా డిమాండ్‌, సప్లయ్‌ ఆధారంగా రేటు నిర్ణయించటం, పసుపు పంటకి ప్రత్యేక బోర్డ్‌ లేకపోవడం వల్లే అని ఏళ్లుగా రైతులు చెపుతున్నా పాలకులకు చెవికెక్కడం లేదు. కనీసం ఎన్నికలప్పుడైనా తమ మాట వింటారన్న ఉద్దేశంతో గడచిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి చరిత్ర సృష్టించారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అరవింద్‌ను గెలిపిస్తే బోర్డు ఏర్పాటు అవుతుందని రైతులు భావించారు. అయితే అదీ నెరవేరకపోవడంతో ఆగ్రహంగా ఉన్నారు. 
పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో ఎంపీ మాట తప్పడంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. పార్లమెంటు సమావేశాల్లో కనీసం పసుపు బోర్డు ప్రస్తావన చేయని ఎంపీ ధర్మపురి అరవింద్‌ను నిలదీస్తామంటున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో స్పందించకుంటే ఎంపీ ఇంటిముందు ధర్నా చేస్తామంటున్నారు. మరి ధర్మపురి అరవింద్ ఏలా స్పందిస్తారో చూడాలి. 

nizamabad
turmeric farmers
Angry
Mp Dharmapuri
promise
Nizamabad turmeric board


మరిన్ని వార్తలు