గుడ్ మార్నింగ్ ధర్మవరం : ప్రజల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి

Submitted on 12 June 2019
MLA Komatireddy Venkat Ram Reddy Good Morning Dharmavaram

అనంతపురం జిల్లాలో ‘గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం’ పేరిట ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం అంటూ...ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేని చిన్నచిన్న స్థానిక సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే అధికారులతో పరిష్కరిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ప్రజల్లో తిరుగుతూ అధికారులను పరుగు పెట్టిస్తున్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

ప్రపంచ వ్యాప్తంగా పట్టు వస్త్రాలకు ప్రఖ్యాతి గాంచిన ధర్మవరం నేతన్నలు సమస్యలతో సతమతమవుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తామన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్ రెడ్డి. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ధర్మవరం ఎమ్మెల్యేగా పనిచేసిన కేతిరెడ్డి, 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రజా సమస్యలపై దృష్టి సారించి గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ధర్మవరంలో ప్రజల్లో తిరుగుతూ ప్రజాసమస్యలపై పోరాటం చేశారని, గత ప్రభుత్వాలు ధర్మవరం అభివృద్ధిని పట్టించుకోలేదంటున్నారు ప్రజలు. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ఎన్నికైన వెంటనే పనిలోకి దిగి ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా వినూత్నంగా తమ ఎమ్మెల్యే పనిచేస్తున్నారని చెబుతున్నారు ధర్మవరం నియోజకవర్గం ప్రజలు.

ఒకరోజు డంపింగ్‌ యార్డ్‌కు వెళ్లి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు డెడ్‌లైన్‌ పెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసి నిర్లక్ష్యంగా ఉన్న వైద్య అధికారులను మందలించారు. సబ్‌రిజిస్ట్రారర్‌ కార్యాలయాల్లో లంచాలు లేకుండా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, అవినీతికి తావులేకుండా చేస్తామంటున్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

MLA Komatireddy Venkat Ram Reddy
Good Morning Dharmavaram
Dump Yard

మరిన్ని వార్తలు