బతుకమ్మ చీరలతో ఆదాయం డబుల్ : నేతన్నలకు గుడ్ న్యూస్ వినిపించిన మంత్రి కేటీఆర్

Submitted on 23 September 2019
minister ktr good news for weavers

నేతన్నలకు చేనేత మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. స్కూల్ యూనిఫాంల తయారీని నేతన్నలకే అప్పగిస్తామన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో పిల్లలకు ఇచ్చే యూనిఫామ్స్ కాంట్రాక్ట్ వారికే ఇస్తామన్నారు. అంతేకాదు ఆర్టీసీ, సింగరేణి కార్మికుల యూనిఫామ్ ల తయారీని కూడా నేతన్నలకే ఇస్తామన్నారు. ఆ  విధంగా నేతన్నలకు ఆదాయం లభించేలా, మేలు జరిగేలా చర్యలు చేపడతామన్నారు. నల్గగొండలో బతుకమ్మ చీరల పంపిణీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బతుకమ్మ చీరలతో నేతన్నల ఆదాయం రెట్టింపు అవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సోమవారం(సెప్టెంబర్ 23,2019) నుంచి తెలంగాణ అంతటా బతుకమ్మ చీరల పంపిణీ మొదలైంది. హుజూర్ నగర్ ఉపఎన్నిక కారణంగా... సూర్యాపేట జిల్లాలో మాత్రం బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కాలేదు. 100 రకాల చీరల్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం పంచిపెడుతోంది. బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకు చీరలు ఇస్తే... వాటిని తయారు చేసేందుకు మరమగ్గ కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఇదివరకు మరమగ్గ కార్మికులకు నెలకు రూ.8వేల నుంచి రూ.12వేలు మాత్రమే వచ్చింది. బతుకమ్మ చీరల తయారీతో నెలకు రూ.16వేల నుంచి రూ.20వేల దాకా ఆదాయం వస్తోంది. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం మూడేళ్ల కిందట ఈ కార్యక్రమం ప్రారంభించింది.

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు చీరలు ఇస్తోంది. 2019లో కోటి 2వేల మందికి ఇవ్వబోతోంది. మొత్తం 16వేల కుటుంబాలు, 26వేల మర మగ్గాల్ని వాడి... ఈ చీరల్ని తయారుచేశాయి. 10 రకాల డిజైన్లు, 10 రకాల రంగులు కలిపి... 100 వెరైటీల్లో చీరలు రెడీ అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు పెట్టింది. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం మూడేళ్లలో రూ.715 కోట్లు ఖర్చు చేసింది.

గ్రామ, వార్డు స్థాయిలో కమిటీలు చీరల్ని పంచుతున్నాయి. ఈసారి చీరల క్వాలిటీ పెంచారు. చీరతోపాటు జాకెట్ కూడా ఇస్తారు. ఒక్కో చీర తయారీకి జీఎస్టీ కాకుండా రూ.280 ఖర్చు చేశారు. 2017లో 95లక్షల 48వేల 439 చీరలు.. 2018లో 96లక్షల 70వేల 474 చీరలు పంచారు. 2019లో 1.02 కోట్ల చీరల్లో... 75 లక్షల చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరాయి. అర్హులైన మహిళలు... ఆయా గ్రామ, వార్డు స్థాయిలో కమిటీ సభ్యులను కలిసి... చీరలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామ స్థాయి కమిటీలో పంచాయతీ, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ మహిళా సంఘం ఆఫీసు బేరర్, రేషన్‌ షాపు డీలర్... వార్డు స్థాయి కమిటీలో బిల్‌ కలెక్టర్, వార్డు మహిళా సంఘం ఆఫీస్ బేరర్, రేషన్‌ డీలర్ సభ్యులుగా ఉంటారు. 

weavers
Telangana
KTR
Good news
school uniforms
Batukamma Sarees
nalgonda

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు