మోడీకి లేఖ రాసిన ప్రముఖులపై దేశద్రోహం కేసు మూసివేత

Submitted on 9 October 2019
Maliciously

మూకదాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసివేశారు. పస లేని ఆరోపణలతో, చిల్లర పిటిషన్ దాఖలు చేసినందుకు న్యాయవాది సుధీర్ ఓఝాపై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు.  కేసు దురుద్దేశపూర్వకమైన తప్పిదమని నిర్థారించినట్లు బిహార్ పోలీస్ శాఖ అధికార ప్రతినిథి జితేంద్ర కుమార్ తెలిపారు. పిటిషనర్‌పై చర్యలకు సిఫారసు చేసినట్లు చెప్పారు. కేవలం ప్రచారం పొందడానికే ఈ పిటిషన్‌ను దాఖలు చేశారన్నారు. నిష్కారణంగా తప్పుడు కేసు పెట్టారని తెలిపారు. 

ఈ పిటిషన్‌ను న్యాయవాది సుధీర్ ఓఝా దాఖలు చేశారు. ఆయనకు లోక్‌జన శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ పార్టీ ఎన్డీయే మిత్ర పక్షం కావడంతో నితీశ్ కుమార్‌ ప్రభుత్వానికి ఈ కేసు తలనొప్పిగా పరిణమించింది. సుధీర్‌ ఓఝాకు చిల్లర పిటిషన్లు దాఖలు చేయడం అలవాటని, ఆయన వల్ల తాను కూడా బాధితుడినయ్యానని బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోడీ తెలిపారు.
 
దేశంలో మూక దాడులు పెరుగుతున్నాయని, జై శ్రీరామ్ నినాదాన్ని రెచ్చగొట్టేందుకు వాడుతున్నారని ఆరోపిస్తూ, ఇటువంటి సంఘటనలపై స్పందించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 49 మంది మేధావులు ఈ ఏడాది జూలైలో లేఖ రాసిన విషయం తెలిసిందే. మణిరత్నం,రేవతి, అపర్ణా సేన్, శ్యామ్ బెనెగల్, రామచంద్ర గుహ, వంటి ప్రముఖులు ఈ లేఖ రాసినవారిలో ఉన్నారు. అయితే మోడీకి లేఖ రాసిన ప్రముఖులపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే.

celebrities
Maliciously False
bihart police
sedition charge

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు