లవర్స్ డే - మూవీ రివ్యూ

Submitted on 14 February 2019
Lovers Day Movie Review-10TV

ఒక సంవత్సరం క్రితం, తన వింక్ వీడియోతో ఓవర్ నైట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అమ్మాయి ప్రియా వారియర్. ఈమె మళయాళంలో నటించిన ఒరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డే పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. గురురాజ్, వినోద్ రెడ్డి, సంయుక్తంగా తెలుగులో రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్‌తో మంచి హైప్‌ని క్రేయేట్ చేసుకుంది. మరి 30 సెకన్ల వీడియోతో, అందరి చూపూ తన వైపుకు తిప్పుకున్న ప్రియా వారియర్.. రెండున్నరగంటల సినిమాతో ధియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాప్రేక్షకుల అంచనాలను అందుకుందా..? లేదా..? ఇప్పుడు చూద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. కాలేజ్.. ఫ్రెండ్స్.. లవ్.. కుళ్లు జోకులు.. సింపుల్‌గా కథ ఇదే. రోషన్.. ప్రియ.. గాధ..ల మధ్య జరిగే కథే లవర్స్ డే. రోషన్.. గాధ స్నేహితులుగా మొదలై, ప్రేమికులుగా మారిపోతారు.. అయితే వారి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసుకునే సమయానికి అనుకోని సంఘటన జరుగుతుంది. అనుకోని ఆ సంఘటన ఏంటి.. అసలు  ఈ కథలో, వింక్ గర్ల్ ప్రియ కథ ఏంటి అనేది మిగతా కథ.

నటీనటుల విషయానికొస్తే.. కాలేజ్ కుర్రాడిగా రోషన్.. అతని స్నేహితులు బాగానే నటించారు. ముఖ్యంగా రోషన్ లవర్ బాయ్‌గా అమ్మాయిల మనసు దోచేస్తాడు. ఇక ప్రియ తనకు బాగా పేరు తెచ్చిన.. కన్ను కొట్టే సీన్.. ముద్దు గన్ను సీన్ థియేటర్‌లో విజిల్స్ కొట్టిస్తాయి.. టీజర్, ట్రైలర్ చూసి ప్రియ మెయిన్ లీడ్ అనుకుంటే పొరపాటే. గాధ గా నటించిన నూరిన్ షరీఫ్, ప్రియ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. అందం.. అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇక ప్రిన్సిపాల్.. లెక్చరర్.. ప్యూన్ పాత్రలు నవ్విస్తాయి. ఇలాంటి కథలు మనం ఎప్పుడో చూసేసాం. ఈ కథ, గతంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను, సొంతం లాంటి ఎన్నో సినిమాల్లో మనకు కనబడుతుంది. లెక్చరర్లు, స్టూడెంట్స్ మధ్య వచ్చే కుళ్లు జోకులు.. ప్రేమ.. ఆకర్షణ.. స్నేహితులు.. వీటి చుట్టే తిరిగిన ఈ కథ.. ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రేమలో ఉన్నా.. గతంలో ఏవైనా జ్ఞాపకాలు ఉన్నా.. సినిమా చూస్తూ ఉంటే అవి బాగానే గుర్తొస్తాయి. అయితే సినిమా అంతా సరదాగా వెళ్తూ ఉంటే.. మరీ నాసిరకంగా ఉంటుందేమో అనో.. లేక ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక దర్శకుడు విషాదంతో తెర దించేశాడు. మొత్తానికి ఈ లవర్స్ డే, లవర్స్‌ని బాగానే అట్రాక్ట్ చేస్తుంది.

టెక్నీషియన్స్ విషయానికొస్తే.. దర్శకుడు ఒమర్, స్నేహం, ప్రేమ విలువలను, వాటిమధ్య తేడాను చెప్పే ప్రయత్నంలో, తాను అనుకున్న కథను తెరమీదకు తీసుకురావడంలో తడబడ్డాడు. ఫస్ట్‌హాఫ్ అంతా సాగతీత సీన్లతో, రొటీన్ కామెడీతో నడిపితే.. సెకండాఫ్ ఫ్లో లేని సన్నివేశాలతో.. అప్పుడే కథను మొదలు పెట్టినట్లుగా కథలోని మెయిన్ ఎమోషన్ ఎలివేట్ కాని విథంగా, ఆసక్తికరంగా లేకుండా కథను నడిపించాడు. అయితే.. ఎమోషనల్‌గా సాగే క్లైమాక్స్‌తో మెప్పించే ప్రయత్నం చేసినా.. అప్పటికే ప్రేక్షకులకు చిరాకుగా అనిపిస్తుంది. ముఖ్యంగా కథలోని మెయిన్ ప్లాట్.. సెకండాఫ్ అయితే కానీ స్టార్ట్ అవ్వదు. అప్పటి వరకూ అనవసరమైన ట్రాక్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. యూత్‌ని ఆకట్టుకునే ఇంట్రస్టింగ్ కంటెంట్ కథలో ఉన్నా... దాన్ని ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా.. దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు.

శ్రీను సిద్దార్థ్ కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తుంది. షాన్ రెహమాన్ అందించిన 9 పాటల్లో 2 పాటలు అలరిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్టు ఉంటుంది. ఇక ఎడిటర్ అచ్చు విజయన్ , దర్శకుడి అభిరుచికి తగ్గట్టే.. తన పనికానిచ్చేశాడు. కథకు తగినట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే, ఒమర్ దర్శకత్వంలో, వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ జంటగా వచ్చిన ఈ చిత్రం యూత్‌ని అలరించే విధంగా ఉన్నా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం నచ్చకపోవచ్చు.

ప్లస్
ప్రియా, నూరిన్ షరీఫ్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
క్లైమాక్స్

మైనస్..
రొటీన్ కథ
క్యారీ కాని ఎమోషన్స్
ఫస్ట్ హాఫ్
 

Priya Prakash Varrier
Roshan Abdul Rahoof
Shaan Rahman
Sukhibava Cinemas
Omar Lulu

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు