సక్సెస్ స్టోరీ : అనాథశ్రమం బతుకు నేర్పింది.. అతన్ని కలెక్టర్ చేసింది!

Submitted on 4 July 2019
From Living in Orphanges to becoming IAS, Kollam's New Collector Abdul Nasar

ప్రతి మనిషికి జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ, అందరూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు. కొందరు మాత్రమే తమ జీవితంలో లక్ష్యాన్ని చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటుంటారు. కళ్లముందే తమ పిల్లలు అందనంత ఎత్తుకు ఎదిగిపోతుంటే చూసి ఎంతో సంతోషిస్తుంటారు తల్లిదండ్రులు.. తమ పిల్లలు ప్రయోజకులు కావాలని పది మందికి ఉపయోగపడాలని కోరుకుంటారు. అలా చెప్పడానికి చదివించడానికి ఎవరూ లేకపోయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడో వ్యక్తి. పుట్టగానే తండ్రిని కోల్పోయాడు.

తల్లి ఇంట్లో పిల్లల పోషణ భరించలేక చిన్నప్పుడే అతన్ని అనాథశ్రమంలో చేర్చింది. అక్కడే ఉంటూ ఒకవైపు చిన్న పనులు చేస్తూనే చదువుకున్నాడు. చదివించడానికి తల్లిదండ్రులు లేరు.. స్కూళ్లకు వెళ్లి చదువుకునే స్థోమత అంతకన్నా లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా అనాథ శరణాలయంలోనే ఉండి చదువుకున్నాడు. అనాథ శరణాలయం నుంచి ఐఏఎస్ చదివాడు. అదే ఆశయంతో ముందుకు సాగి ఇప్పుడు ఓ జిల్లా కలెక్టర్ స్థాయికి ఎదిగాడు. కలెక్టర్ అవ్వాలనే తన లక్ష్యాన్ని సాధించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతడే.. కొల్లం కొత్త కలెక్టర్ బి. అబ్దుల్ నజర్. 

అనాథలా పెరిగి :
తన ఐదేళ్ల అప్పుడే నజర్ తండ్రి చనిపోయాడు. చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు పడిన నజర్.. కేరళలోని అనాథ శరణాలయంలో 17ఏళ్ల వయస్సు వరకు అక్కడే జీవనం సాగించాడు. తాను ఈ సక్సెస్ సాధించడానికి వెనుక తన తల్లి మంజుమ్మ పాత్ర ఎంతో ఉంది. కష్ట సమయాల్లో కూడా తన కుమారుడిని చదివించాలనే ఆమె ఎంతో తపన పడింది. నజర్ తోపాటు ఆరుగురు పిల్లలను పెంచి పోషించలేని స్థితిలో ఆమె ఎంతో కష్టపడింది. ఆర్థిక సమస్యలతో అల్లాడిపోయింది.

ఇళ్లలో పనిచేయగా వచ్చిన డబ్బులతో పిల్లలను పోషించడం భారంగా మారింది. స్థానికులు, బంధువుల సూచన మేరకు నజర్ ఐదేళ్లప్పుడే థాలస్సెరీ సొంత గ్రామంలోని అనాథశ్రమంలో చేర్చినట్టు నజర్ చెప్పుకొచ్చాడు. 49ఏళ్ల నజర్.. చిన్నతనంలోనే కేరళలోని అన్ని జిల్లాలను చుట్టేశాడు. కనీసం ఆరు ఉద్యోగాలు చేశాడు. 16ఏళ్ల వయస్సులోనే హోటల్స్, షాపుల్లో పనిచేశాడు. డెలివరీ బోయ్, క్లీనర్ గా పనిచేశాడు. చేయని పని లేదు. అనాథశ్రమంలో ఉంటూనే పనిచేసుకుంటూ చదువుకున్నాడు. 

కలెక్టర్‌గా ఎదిగి : 
10వ తరగతి పూర్తి అయ్యాక త్రిసూర్ లోని వతనపల్లి అనాథశరణాలయానికి మారాడు. అక్కడే ఇస్లామియా కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. బెంగళూరులో షార్ట్ కోర్సు చేసి అనంతరం సొంత గ్రామానికి వచ్చేశాడు. బ్రెనెన్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో BA ఇంగ్లీష్ లిటరేచర్ లో చేరి డిగ్రీ పట్టా పొందాడు. ఆ తర్వాత ఫరూక్ కాలేజీలో పీజీ, BED పూర్తి చేశాడు. కొన్నాళ్లకు నజర్ రుక్సానాను వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన అనంతరం సివిల్ సర్వీసెస్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు.

తన భార్య సహకారంతో చెన్నై, ఢిల్లీ, అలిగఢ్ వెళ్లి పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. కేరళ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటీవ్ (డిప్యూటీ కలెక్టర్ ఎగ్జామ్)లో మంచి ర్యాంకు సాధించాడు. 2002లో సివిల్ సర్వీసెస్ ప్రీలీమ్స్ రాశాడు. 2004లో మెయిన్స్ రాశాడు. 2015లో కేరళలో డిప్యూటీ కలెక్టర్ గా అవార్డు పొందాడు. ఎంట్రన్స్ ఎగ్జామ్ కమిషనర్ గా ఉన్నప్పుడే నజర్.. ప్రభుత్వ సహకరంతో రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఆన్ లైన్ విధానంలోకి మార్చడంలో ఎంతో కృషి చేశారు.  

Orphanges
IAS
Kollam Collector
Abdul Nasar
Odd jobs


మరిన్ని వార్తలు