ఆరోపణలపై ఒక్క ఆధారం చూపినా రాజకీయాల నుంచి తప్పుకుంటా : కోడెల ఛాలెంజ్

Submitted on 12 June 2019
kodela sivaprasad rao reaction on k tax allegations

కే ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని కొంతకాలంగా ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యులపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కొంతమంది వ్యక్తులు పోలీస్ స్టేషన్లలో కోడెల కుమారుడు శివరామ్ పై ఫిర్యాదులు చేశారు. ఈ ఆరోపణలపై కోడెల స్పందించారు. తన కుటుంబసభ్యులపై చేస్తున్న ఆరోపణలను కోడెల ఖండించారు. ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం చూపినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కోడెల సవాల్ విసిరారు. తనపై తన కుటుంబసభ్యులపై ఆరోపణలు సరికాదన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం ప్రజల కోసం ఉపయోగించాలి కానీ కక్ష సాధింపు కోసం కాదన్నారు. తన కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని కోడెల ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేధిస్తే ఊరుకోమన్నారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు.

స్పీకర్ పదవికి కళంకం తెచ్చానని వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన విమర్శలను కోడెల ఖండించారు. స్పీకర్‌గా నిష్పాక్షికంగా పనిచేశానని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించినప్పుడు కూడా సభకు రావాలని ఆహ్వానించానని గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు... తప్పుడు కేసులు పెట్టమని జనాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని కోడెల మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులు పెరిగాయన్న ఆయన.. టీడీపీ కార్యకర్తలు గ్రామాలు విడిచి పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నారని వాపోయారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

కుటుంబంలో తాను తప్ప ఎవరూ రాజకీయాల్లోకి రారని కోడెల చెప్పుకొచ్చారు. తన కుమారుడు శివరామకృష్ణ బిజినెస్ చేసుకుంటున్నాడని తెలిపారు. పిలిస్తే తప్ప పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు తన కుమారుడు హాజరుకాడని చెప్పుకొచ్చారు. తన కూతురు గైనకాలజిస్ట్‌ అని తెలిపారు. తప్పుడు కేసులతో తన కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కోడెల మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి వేధింపులు లేవని, విజయసాయి రెడ్డి ఆరోపణల్లో నిజం లేదని కోడెల వివరించారు. తన కుమార్తె ఫార్మా కంపెనీని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. కేసులపై న్యాయపోరాటం చేస్తానని కోడెల అన్నారు. కాగా, కోడెల కుటుంబంపై ఆయన నియోజకవర్గంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లకు బాధితులు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు శివరామ్.. కే ట్యాక్స్ పేరుతో.. తమను బెదిరించి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేశారని పలువురు బిల్డర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.

kodela sivaprasad rao
k tax
Kodela sivaram
guntur
VijayaSai Reddy
TDP

మరిన్ని వార్తలు