kanna lakshmin narayana vs vijayasai reddy on corona

మీరు సుజనాకు అమ్ముడుపోయారా లేదా? కన్నాపై విజయసాయిరెడ్డి ఫైర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లో వేడి రాజుకుంది. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ రగడ షురూ అయ్యింది. ఇన్ని రోజులు కామ్ గా ఉన్న నాయకులు కరోనా టెస్ట్ కిట్లపై మాటల యుద్దానికి దిగారు. ముఖ్యంగా వైసీపీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే వివాదం నడుస్తోంది. ఛత్తీస్‌గఢ్ రూ.337కి కిట్ కొంటే.. ఏపీ ప్రభుత్వం రూ.730కి కొనుగోలు చేసిందని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.

కరోనా కిట్లపై కన్నా చేసిన ట్వీట్ తో మొదలైన యుద్ధం:
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కరోనా కిట్లపై చేసిన ట్వీట్‌తో మాటల యుద్ధం మొదలైంది. ట్విట్టర్‌లో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఏపీ బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కన్నా సంచలన ట్వీట్ చేశారు. దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన కరోనా కిట్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. కిట్లలో కూడా కమీషన్ కొట్టారా.. ‘మన పక్క రాష్ట్రం ఛత్తీస్ గఢ్ కరోనా కిట్లను దక్షిణకొరియా నుండి కేవలం రూ.337+GSTకి కొన్నారు. మరి మీరు అదే దక్షిణ కొరియా నుండి తెప్పించిన లక్ష కిట్లు ఎంతకు తెచ్చారు. ఈ రెండు కిట్ల రేట్లలో తేడాని ప్రజలకు చెప్పి ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవాలి’ అని కన్నా అన్నారు. కన్నా చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా దుమారం రేగింది.

కన్నా రూ.20కోట్లకు చంద్రబాబుకి అమ్ముడుపోయారు:
కన్నాకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లక్ష్మీనారాయణ రూ. 20 కోట్ల రూపాయలకు చంద్రబాబుకు అమ్ముడుపోయారని.. టీడీపీ మాజీ నేత, ఎంపీ సుజనా చౌదరి ద్వారా డీల్ జరిగిందని విమర్శించారు. సుజనా చౌదరి మధ్యవర్తిత్వం నిర్వహించి చంద్రబాబు, కన్నాను కలిపారని.. అందుకే చంద్రబాబు తరహాలోనే కన్నా కూడా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర నాయకత్వం ఆమోదం లేకుండా కన్నా ఎందుకు అలా మతి భ్రమించి మాట్లాడుతున్నారో ఆయననే అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయం మరింతగా వేడెక్కింది.

విజయసాయిరెడ్డి.. మీ పాపం పండే టైం వచ్చేసింది:
విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని బీజేపీ కూడా గట్టిగా తిప్పికొట్టింది. పార్టీ అధికారిక ట్విట్టర్‌ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేసింది. సూట్ కేస్ రెడ్డి, బహుకాలపు జైలు పక్షివి, రాజకీయాల్లో అక్కుపక్షివి.. వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవి.. ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునే 5రూ ఆర్టిస్ట్‌వి.. మీ బతుకు అంతా కేసులు-సూట్ కేసులే.. మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చూసుకోండి. పాపం పండే టైం వచ్చేసింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీజేపీ అధికారిక అకౌంట్ ద్వారా చేసిన ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది.

మళ్లీ అడుగుతున్నా…కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా?:
దీనికి మళ్లీ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. మళ్లీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘మళ్లీ అడుగుతున్నా…కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా?.. టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా’ అంటూ మళ్లీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇలా విమర్శలు, ప్రతి విమర్శలతో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

Related Posts

Trending

Latest News