ఫైనల్ స్టేజ్ లో ఆపరేషన్ వశిష్ట-2 : బోటు పైకప్పు వెలికితీత

Submitted on 21 October 2019
kachuluru boat extraction

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు వెలికితీతలో మరింత పురోగతి సాధించారు. ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. యాంకర్‌కు తగిలిన బోటు పైకప్పును పైకి తీసుకొచ్చారు. మరోవైపు బోటును వెలికితీసేందుకు ధర్మాడి బృందం విశ్వప్రయత్నం చేస్తోంది. రెండు రోప్‌ల ద్వారా బోటును వెలికి తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ రోప్‌లను బోటుకు బిగించినట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో బోటును పూర్తిగా వెలికితీయవచ్చని భావిస్తున్నారు. సుడిగుండాలు లేకపోవడం.. గోదావరి నీటిమట్టం 38-40 అడుగుల స్థాయిలోనే ఉండటంతో బోటును వెలికితీసేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా 6వ రోజూ నీటిమట్టం తగ్గడం అనుకూలించింది.

విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్‌ వాటర్‌ సర్వీసెస్‌కు చెందిన 10 మంది డీప్ సీ డైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు నిన్న ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు. దాదాపు 15 నిమిషాలపాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది? దాని చుట్టూ ఇసుక, మట్టి ఎంతమేర పేరుకుపోయాయి? బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి రావడానికి అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలించి వచ్చి పోర్టు అధికారికి వివరించారు. ఇలా ఆరుసార్లు డైవర్లు బోటు మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరిలో బోటు ఏటవాలుగా మునిగి ఉందని పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ తెలిపారు. నదిలో బోటు ముందు భాగం 40 అడుగుల లోతులో ఉంటే... వెనుక భాగం దాదాపు 70 అడుగుల లోతులో ఉందని చెప్పారు.

నాలుగు రోజుల క్రితం బోటు వెలికితీత పనుల్లో లంగరుకు బలమైన వస్తువు తగిలింది. ఈ క్రమంలో బోటు రెయిలింగ్‌ ఊడిపోగా... దాన్ని ఒడ్డుకు లాగారు. దీంతో బోటు ఆచూకీని పక్కాగా గుర్తించిన ధర్మాడి సత్యం టీమ్... దాన్ని వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ధర్మాడి సత్యం స్వయంగా విశాఖ వెళ్లి... డీప్‌ సీ డైవర్స్‌ను తీసుకొచ్చారు. వీరంతా నదీ గర్భంలోకి వెళ్లి బోటుకు రోప్‌ బిగించడంతో... ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట ఫైనల్‌ స్టేజ్‌కు చేరినట్లు తెలుస్తోంది. సాయంత్రం కల్లా బోటును కచ్చితంగా వెలికితీస్తామని ధర్మాడి సత్యం ధీమాగా చెప్తున్నారు.

kachuluru boat extraction
Godavari
dharmadi satyam
operation royal vasista

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు