చంద్రబాబుకు జగన్ సవాల్: రాజీనామా చేసి వెళ్లిపోతావా? 

Submitted on 11 July 2019
Jagan Challenge to Chandrababu in AP Assembly Budget Session

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఏపీలో కరువుపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. రైతుల కోసం సున్నా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చినట్టు జగన్ ప్రకటించగా.. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సున్నా వడ్డీకే రుణం పథకం ఉందని దానిని టీడీపీ ప్రభుత్వం కొనసాగించినట్లు చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై సీఎం స్పందిస్తూ 2014-19 వరకు చంద్రబాబునాయుడి హయాంలో సున్నా వడ్డీకి ఎన్ని నిధులు రుణం ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. 2014 నుంచి 19 వరకు ఎలాంటి సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇవ్వలేదని రికార్డులు స్పష్టం చేస్తే చంద్రబాబు రాజీనామా చేసి వెళ్లిపోతారా? అంటూ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.

జగన్ సంధించిన సవాల్‌పై వెంటనే స్పందించిన చంద్రబాబు.. సెక్రెటరీ రాసిస్తే మీరు చదువుతారని, వెటకారం చేస్తూ.. ఎగతాళిగా మాటలు అనడం కరెక్ట్ కాదని అన్నారు. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో పాలసీ ఉంటుందని, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా చేస్తే మంచిదని, అలా చేసి ప్రజలకు చెప్పుకోవచ్చని అన్నారు. లెక్కలు అనేవి ఎవరు పడితే వారు రాసుకునేందుకు వీలుండదని అన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఏపీ నెంబర్ వన్‌గా ఉందంటే టీడీపీ ప్రభుత్వం వలనే అని చెప్పారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు.. జగన్ మోహన్ రెడ్డికి సూచించారు. ఎవరి విధానాలు వారికి ఉంటాయని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాగా మాట్లాడాలని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని, కనీసం వయసుకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అడుగడుగునా అవమానిస్తున్నారని మండిపడ్డారు.

AP Assembly Budget Session
Jagan
Chandrababu


మరిన్ని వార్తలు