రైల్వే చరిత్రలో ఫస్ట్ టైమ్ : ఆలస్యమైనందుకు ప్రయాణికులకు రూ.1.62 లక్షలు పరిహారం

Submitted on 21 October 2019
IRCTC to pay around Rs 1.62 lakh as compensation for late running tejas

రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తాం. ఇదీ ఐఆర్ సీటీసీ ఇచ్చిన హామీ. ఇప్పుడా హామీని నిలుపుకునేందుకు ఐఆర్ సీటీసీ రెడీ అయ్యింది. తేజస్ రైల్లో ప్రయాణించిన వారికి పరిహారం చెల్లించనుంది. 950 మంది ప్రయాణికులకు రూ.1.62లక్షల కాంపన్ సేషన్ ఇవ్వనుంది. ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఆ మొత్తాన్ని ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ ప్రెస్. లక్నో-ఢిల్లీ మధ్య నడుస్తుంది. తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ అనుబంధ సంస్థ ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తోంది. అక్టోబర్ 19న లక్నో నుంచి ఉదయం 9.55గంటలకు బయలుదేరిన తేజస్ రైలు ఢిల్లీకి 12.25 గంటలకు చేరుకోవాలి. కాన్పూర్ పరిసరాల్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ప్రభావంతో తేజస్ రైలు మధ్యాహ్నం 3.40గంటలకు ఢిల్లీకి చేరుకుంది.

అలాగే 3.35గంటలకు తిరిగి లక్నోకి బయలుదేరాల్సిన రైలు 5.30గంటలకు గానీ కదలేదు. దీంతో రాత్రి 10.05 గంటలకు లక్నో చేరుకోవాల్సి ఉండగా.. రాత్రి 11.30గంటలకు చేరుకుంది. దీంతో లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లిన 450మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున.. ఢిల్లీ నుంచి లక్నోకి వెళ్లిన 500మందికి ఒక్కొక్కరికి రూ.100 చొప్పున చెల్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తేజస్ టికెట్ పై ఇచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ లింక్ ద్వారా పరిహారం పొందొచ్చని అధికారులు తెలిపారు.

అక్టోబర్ 6 నుంచి తేజస్ ఎక్స్ ప్రెస్ కమర్షియల్ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఎలాంటి ఆలస్యం జరగలేదు. అక్టోబర్ 19, 20వ తేదీలలో మాత్రమే రైలు ఆలస్యంగా నడిచిందని అధికారులు తెలిపారు. 20న కేవలం 24 నిమిషాలు మాత్రమే ఆలస్యమైందని.. రెండో ట్రిప్ లో సమయానికి చేరుకుందని అధికారులు వివరించారు. నిర్దేశించిన సమయం కన్నా గంటకు పైగా ఆలస్యమైతే ఒక్కో ప్రయాణికుడికి రూ.100 చొప్పున, రెండు గంటలకు పైగా ఆలస్యమైతే రూ.250 చొప్పున చెల్లిస్తామని ఐఆర్ సీటీసీ ప్రకటించింది. అందుకు కట్టుబడి పరిహారం ఇవ్వడానికి రెడీ అయ్యింది. రైళ్లు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లించడం రైల్వే చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్. ఈ ఫెసిలిటీ ఏదో బాగుందని ప్యాసింజర్లు ఖుషీ అవుతున్నారు.

తేజస్ ఎక్స్ ప్రెస్ రైలుతో లక్నో-ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం తగ్గింది. ఈ మార్గంలో నడుస్తున్న వేగవంతమైన స్వర్ణ శతాబ్ది రైలు 6గంటల 40 నిమిషాల్లో లక్నో నుంచి ఢిల్లీకి చేరుకుంటోంది. తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రం 6గంటల 15 నిమిషాల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీకి చెందిన తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక వసతులున్నాయి. ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున పరిహారం చెల్లిస్తారు. అంతేకాదు ఇందులో ప్రయాణించేవారు రూ. 25 లక్షల ఉచిత బీమా సౌకర్యం పొందొచ్చు. తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ చైర్‌ కారుకు రూ. 1,280, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కారుకు రూ. 2,450 చెల్లించాలి.


ఈ ఎక్స్‌ప్రెస్‌ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఇలాంటివి ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా లాంటి 50 ప్రధాన మార్గాల్లో ప్రైవేట్‌ రైళ్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని రైల్వే బోర్డు ఇప్పటికే జోనల్‌ రైల్వే విభాగాలకు సూచించింది.

irctc
PAY
Rs 1.62 lakh
compensation. late running
tejas
passengers

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు