ప్రభుత్వం ఇచ్చే రూ.10వేలు సాయానికి భారీగా దరఖాస్తులు

Submitted on 15 September 2019
huge applications for financial assistance for auto, cab drivers

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేలు ఆర్థికసాయం ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. తొలిరోజే మంచి స్పందన వచ్చింది. ఫస్ట్ డే భారీగా అప్లికేషన్లే వచ్చాయి. 7వేల 559 మంది వాహన యజమానులు కమ్‌ డ్రైవర్లు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 1,135 అప్లికేషన్లు వచ్చాయి. ఆ తర్వాత తూర్పగోదావరి జిల్లాలో 833, విశాఖపట్నంలో 763 అప్లికేషన్లు వచ్చాయి. సెప్టెంబర్ 14 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించారు. సెప్టెంబర్ 25 దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరు తేదీ.

సెప్టెంబర్ 30లోగా గ్రామ/వార్డు వలంటీర్లు ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అక్టోబర్‌ 1లోగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు సీఎం జగన్‌ సందేశాన్ని అందిస్తారు. అక్టోబర్‌ 4 నుంచి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తారు. రవాణా శాఖ అధికారులు శనివారం(సెప్టెంబర్ 14,2019) నుంచి దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దరఖాస్తులను రవాణా శాఖ వెబ్‌సైట్‌ (www. aptransport. org), అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు/ఆర్‌టీవోలు/ఎంవీఐ కార్యాలయాలతో పాటు మీసేవ, సీఎస్‌సీ (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌) కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకునేందుకు, రుణం లేని బ్యాంకు పాస్‌ పుస్తకం పొందేందుకు దరఖాస్తుదారులకు గ్రామ/వార్డు వలంటీర్లకు సహకారం అందిస్తారు. 

పాదయాత్రలో ఆటోడ్రైవర్ల సమస్యలు విన్న జగన్...అధికారంలోకి రాగానే బీమా, ఫిట్‌నెస్, మరమ్మత్తుల కోసం ఏడాదికి రూ.10 వేలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కాగానే ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారుచేశారు. అర్హులు ఎంతమంది ఉన్నా వారందరికీ ఆర్థికసాయం ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు.

సెప్టెంబర్ 25లోగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే సాయం:
* గ్రామ/వార్డు వలంటీర్లు దరఖాస్తుదారుడి నుంచి ఆధార్, తెల్ల రేషన్‌ కార్డులు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, డ్రైవింగ్‌ లైసెన్సు, రుణం లేని బ్యాంకు పాస్‌ పుస్తకం మొదటి పేజీ, అకౌంట్‌ వివరాలు, కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ, మైనార్టీ అయితే) జిరాక్స్‌ కాపీలు తీసుకోవాలి. 
* వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం యజమాని దగ్గర వాహనం ఉందో లేదో చూడాలి. 
* ఆ తర్వాత దరఖాస్తులను ఎంపీడీవో/సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి/మున్సిపల్‌ కమిషనర్‌/బిల్‌ కలెక్టర్లకు పంపిస్తారు.
* కాగా, సొంత ఆటో/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌లు సెప్టెంబర్ 25లోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌గా ఉండే వారికి ఈ పథకం వర్తిస్తుంది. 
* వాహనం భార్య పేరున ఉండి భర్త వాహనం నడుపుతుంటే సాయం భార్యకు వర్తిస్తుంది.

ఈ పథకం అమలుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ప్రతి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు రవాణశాఖ కమిషనర్‌ ఆంజనేయులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో రవాణా కమిషనర్‌ కార్యాలయంలోని సంయుక్త రవాణా కమిషనర్‌ (ఐటీ) నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేశారు.

cm jagan
auto
cab
Drivers
applications
financial assistance

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు