ఆస్ట్రేలియా సిరీస్‌కు హర్దీక్ పాండ్య దూరం

Submitted on 21 February 2019
Hardik Pandya Rested from Australia series due to lower back stiffness

భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో హోం సిరీస్ కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగనున్న అంతర్జాతీయ టీ20, వన్డే హోం సిరీస్ నుంచి పాండ్యకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది.  ఈ మేరకు బీసీసీఐ గురువారం (ఫిబ్రవరి 21న) మీడియా ప్రకటనలో తెలిపింది. వెన్నుముక నొప్పితో బాధపడుతున్న పాండ్యాను పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి విశ్రాంతి కల్పిసున్నట్టు పేర్కొంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తన వెన్నుముక బలపడేంత వరకు 25ఏళ్ల పాండ్య ట్రైనింగ్ తీసుకోనున్నాడు. టీ20 జట్టులో భారత తరపున పాండ్య స్థానంలో ఎవరి పేరును ఇంకా ఖరారు చేయలేదు. ఇప్పటికే భారత టీ20 జట్టులో 14 మంది సభ్యులు ఉన్నారు. మరోవైపు వన్డే జట్టులోకి పాండ్య తరపున రవీంద్ర జడేజా రానున్నాడు. 

పాకిస్థాన్ తో ఆసియా కప్ మ్యాచ్ జరిగే సమయంలో పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే. ఆ గాయంతో విండోస్ తో జరిగిన హోం సిరీస్ కు పాండ్య దూరమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జరుగుతున్న సమయంలో పాండ్య తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. కానీ, అదే సమయంలో అనుచిత వ్యాఖ్యలు కారణంగా బీసీసీఐ నుంచి నిషేధానికి గురై టెస్టులకు దూరమయ్యాడు. నాలుగు నెలల తరువాత న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డే సిరీస్ లో పాండ్య తిరిగి భారత జట్టులోకి అడుగుపెట్టాడు. హర్దీక్ పాండ్య టీ20 సిరీస్ కు దూరం కావడంతో అతడి స్థానంలో విజయ్ శంకర్ ను తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఆస్ట్రేలియాతో హోం సిరీస్ లో భాగంగా రెండు టీ20 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 24 విశాఖపట్నం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. రెండో టీ20 మ్యాచ్ బెంగళూరు వేదికగా జరుగనుంది. అనంతరం వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మార్చి 2న హైదరాబాద్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. మార్చి 5న రెండో వన్డే నాగ్ పూర్ వేదికగా, రాంచీ వేదికగా మార్చి 8న మూడో వన్డే, మొహాలి, ఢిల్లీ వేదికలుగా చివరి రెండు వన్డేలు (మార్చి 10, మార్చి 13తేదీల్లో) జరుగనున్నాయి. 

Hardik Pandya
Australia series
Ravindra Jadeeja
Pakistan
BCCI

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు