అవమాన భారంతో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

Submitted on 20 October 2019
grama volunteer suicide

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. యర్రగొండపాలెం పట్టణంలో ఈ ఘటన జరిగింది. మృతురాలి పేరు షేక్ జుబేదా(20). శనివారం(అక్టోబర్ 19,2019) ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం బాత్రూమ్ లో రాడ్ కు చున్నీతో ఉరేసుకుందని తల్లి తెలిపింది. తన కూతురి చావుకి తహసీల్దార్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే గుంటూరి శివప్రసాద్ కారణం అని తల్లి ఆరోపించింది. ఈ ఘటన తర్వాత శివప్రసాద్ చారి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

శివప్రసాద్ చారి అవమానకరంగా మాట్లాడినందువల్లే తమ కుమార్తె ఉరేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాత్రి శివప్రసాద్ చారి తమ ఇంటికి వచ్చాడని, రికార్డులన్నీ పూర్తి చేసి శనివారం ఉదయానికి కార్యాలయానికి తీసుకురావాలని తన కూతురిని హెచ్చరించాడని తల్లి చెప్పింది. సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, ఉద్యోగం ఊడిపోతుందని అవమానకరంగా మాట్లాడినట్టు వాపోయింది. శివప్రసాద్ మాటలతో మనస్తాపం చెందిన జుబేదా ఆత్మహత్య చేసుకుందని తల్లి కన్నీటిపర్యంతం అయ్యింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న శివప్రసాద్ కోసం గాలిస్తున్నారు. శివప్రసాద్ ను విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

జగన్ ప్రభుత్వం ఇటీవలే గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజల ఇంటికే ప్రభుత్వ పథకాలు అందించే ఉద్దేశ్యంతో వాలంటీర్లను నియమించారు సీఎం జగన్. అయితే గ్రామ వాలంటీర్ల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గత నెలలో ఓ మహిళ దురుసుగా మాట్లాడిందన్న మనస్తాపంతో పశ్చిమగోదావరి జిల్లా పండువారి గూడెంకు చెందిన పండు నవీన ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. అది మరువకముందే అధికారి వేధింపులు తట్టుకోలేక ప్రకాశం జిల్లాలో మరో గ్రామ వాలంటీర్ సూసైడ్ చేసుకోవడం కలకలానికి దారితీసింది.

నెలకు రూ.5 వేలు జీతంతో వాలంటీర్ ఉద్యోగులను నియమించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం వాలంటీర్ల బాధ్యత. ప్రభుత్వంపై నమ్మకాన్ని, విశ్వసనీయతను పెంచాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో పింఛన్ల పంపిణీ, ప్రజాపంపిణీ సరుకులు, ఇంకా అనేక రకాల సేవల్ని వాలంటీర్లు ప్రజలకు నేరుగా ఇంటికి తీసుకెళ్లి అందించాలి.

grama volunteer
Suicide
prakasam district
Insult
Yerragondapalem

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు