ఏం జరుగనుంది : ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ ఆరా

Submitted on 17 October 2019
Governor's focus on TS RTC strike

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సమ్మెపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను గవర్నర్ కార్యాలయం కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. రవాణ శాఖ కార్యదర్శిని గవర్నర్ వద్దకు పంపించారు. కార్మికుల డిమాండ్లు, సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆయన వివరిస్తున్నారు.

మరోవైపు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో మంత్రి పువ్వాడ పాల్గొనడంతో..రవాణ కార్యదర్శిని గవర్నర్ కార్యాలయానికి పంపించారు. సీఎంతో భేటీ అనంతరం మంత్రి పువ్వాడ..గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది. ఈ భేటీ అక్టోబర్ 17వ తేదీ గురువారం లేదా అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం జరిగే అవకాశం ఉంది. 

అక్టోబర్ 14వ తేదీన తమిళిసై ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలతో రాష్ట్రంలో అలజడి రేగుతున్న సందర్భంలో గవర్నర్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తిగా మారింది. అనంతరం హైదరాబాద్ చేరుకున్న అనంతరం సమ్మెపై ఆరా తీయడం ఉత్కంఠగా మారింది. 

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. సమ్మె విరమించి చర్చలకు రావాలని ప్రభుత్వం, తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే..సమ్మె విరమిస్తామని కార్మికులు చెబుతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. చివరకు న్యాయస్థానానికి చేరుకుంది. ప్రభుత్వం, కార్మికులు చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. తదుపరి విచారణనను అక్టోబర్ 18 శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో కోర్టు ఎదుట ఎలాంటి వాదనలు వినిపించాలనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గవర్నర్ ఆరా తీయడం..కోర్టు శుక్రవారం విచారణ చేపడుతుండడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

Governor
Focus
TS RTC strike
tamilisai
Governor Office
CM KCR
Pragati Bhavan

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు