ఇక తప్పించుకులేరు : ఇండియన్స్ స్విస్ అకౌంట్ల వివరాలు.. ఐటీ చేతుల్లోకి!

Submitted on 11 July 2019
Government to get Swiss bank details of all Indians from September

విదేశాల్లో నిల్వ చేసిన భారతీయుల బ్లాక్ మనీకి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తగిన ప్రోత్సాహం లభిస్తోంది. 2019 సెప్టెంబర్ లో స్విస్ బ్యాంకు అకౌంట్లు కలిగిన భారతీయల తొలి వివరణాత్మక ఆర్థిక సమాచారం భారత్ చేతుల్లోకి రానుంది. 2018 ఏడాదిలో అకౌంట్లు మూసివేసిన వారి ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా భారత ఐటీ అధికారులకు చేరనున్నాయి. 

సెప్టెంబర్ నుంచి డేటా షేరింగ్ :
ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (AEOI) ఫ్రేమ్‌వర్క్ కింద స్విట్జర్లాండ్.. ప్రతి భారతీయుడి బ్యాంకు అకౌంట్ల వివరాలైన అకౌంట్ నెంబర్లు, క్రెడిట్ బ్యాలెన్స్ తో పాటు ప్రతి స్విస్ ఆర్థిక సంస్థల వివరాలన్నీ భారత ఐటీ అధికారులకు షేర్ చేయనున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబరులో మొదటి సెట్ తర్వాత వార్షిక ప్రాతిపదికన మరింత సమాచారం పంపే అవకాశం ఉందని స్విట్జర్లాండ్ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ (FDF) తెలిపింది.  

పన్ను విషయాలపై ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం.. వ్యక్తులు, సంస్థలతో కలిపి దాదాపు 100 మంది భారతీయ సంస్థలకు సంబంధించిన వివరాలను స్విట్జర్లాండ్ ఇప్పటికే భారత్‌కు అదనంగా వివరాలను అందిస్తోంది. స్విస్ బ్యాంకు అకౌంట్లు కలిగిన భారతీయులకు చెందిన వివరణ్మాతక సమాచారాన్ని సెప్టెంబర్ నుంచి స్వీకరించడం ప్రారంభం అవుతుందని బుధవారం లోక్ సభలో లేవనెత్తిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి వి.మురీధరన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఆ పేర్లను బహిర్గతం చేస్తారా? :
భారత-స్విట్జర్లాండ్ పన్ను ఒప్పందంలో భాగంగా.. దర్యాప్తులో ఉన్న కేసులకు అభ్యర్థన ప్రాతిపదికన సమాచారాన్ని స్వీకరించడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు. అందుకున్న సమాచారంలో అభ్యర్థనపై లేదా ఆటోమేటిక్ ప్రాతిపదికనతో అవినీతికి పాల్పడినవారి సమాచారం ఉండే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం.. ఆ పేర్లను వెల్లడిస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. సమాచారాన్ని  బహిర్గతం చేయడమనేది గోప్యత నిబంధనలపై ఆధారపడి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. 

అందుకే భారత్‌కు మద్దతు :
జనవరి 1, 2018 నుంచి అమల్లోకి వచ్చిన భారత్‌తో AEOI ఒప్పందాన్ని వివరిస్తూ.. స్విట్జర్లాండ్ ప్రపంచ సంపద నిర్వహణ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమగ్రతకు తోడ్పాటుగా ఉండాలనే ఉద్దేశంతో సమాచారాన్ని షేర్ చేసేందుకు ముందుకు వచ్చినట్టు ఎఫ్‌డిఎఫ్ తెలిపింది. అంతర్జాతీయ పాదర్శకత ప్రమాణాలకు అనుగుణంగా పన్ను ఎగవేత, రుణాల ఎగవేతకు వ్యతిరేకంగా భారత్‌కు మద్దతు ఇచ్చేందుకు స్విస్ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.

AEOI ఫ్రేమ్‌వర్క్ కింద, 2018 లో స్విస్ ఆర్థిక సంస్థ నిర్వహించే ఖాతాను కలిగి ఉన్న భారతీయ నివాసితులందరిపై వివరణాత్మక ఆర్థిక సమాచారాన్ని 2019 సెప్టెంబర్‌లో మొదటిసారిగా భారత ఐటీ అధికారులకు అందించనున్నట్టు FDF తెలిపింది. ఆ తరువాత నుంచి వార్షిక ప్రాతిపదికన ఆర్థిక సమాచారాన్ని అందించడం జరగుతుందని పేర్కొంది. ఈ సమాచారంలో 2018లో మూసివేసిన స్విస్ ఖాతాల సమాచారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. 

credit balance
Swiss bank details
Indians
september
AEOI


మరిన్ని వార్తలు