రైతులకు మంచి రోజులు : సీఎం జగన్ కీలక నిర్ణయం

Submitted on 15 September 2019
good news for farmers

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు శుభవార్త వినిపించారు. వారికి ఇబ్బందులు లేకుండా, లాభాలు కలిగేలా ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌ కోసం అత్యుత్తమ నిపుణులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అగ్రి మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి రైతులకు మేలు చేకూరేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్ లో సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ వ్యవసాయ మిషన్‌ 3వ సమావేశం జరిగింది.

అక్టోబర్ 15 నాటికే మినుములు, పెసలు, శనగలు తదితర పంటల కొనుగోలు కోసం కేంద్రాలు తెరవాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి మంచి విధానాలను ఆలోచించాలన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని, ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచిగా మార్కెట్‌ కల్పించే పద్ధతులు అన్వేషించాలన్నారు. రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని అగ్రి మిషన్‌ సభ్యులు, అధికారులతో సీఎం జగన్‌ చెప్పారు.

పంటల ధరలను స్థిరీకరించడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ప్రభుత్వం, రైతుల దగ్గర నిల్వలు ఉన్నాయని.. దీంతోపాటు దిగుమతి విధానాలు సరళతరం చేయడం కూడా ధర తగ్గడానికి ప్రధాన కారణాలని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అందువల్లే టమాటా, ఉల్లి ధరల్లో హెచ్చు తగ్గులున్నాయని వివరించారు. గత ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి నిధులు సమకూర్చలేదని, పంటలకు ధర పడిపోయిన తర్వాత ధరల స్థిరీకరణ పథకం కింద నిధులు తెచ్చుకునే సరికి పుణ్యకాలం గడచిపోయేదన్నారు. గ్రామ వలంటీర్ల సహాయంతో ప్రతి రైతూ వారి పంటలు రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. తద్వారా గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయడానికి వీలవుతుందన్నారు.

రూ.1830 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఈ నెలాఖరు నుంచి రైతులకు అందజేయాలని ఆదేశించారు. అక్టోబర్ 15న ప్రారంభమయ్యే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా పథకం కింద ఇచ్చే పెట్టుబడి సాయం అందితే కరవు ప్రాంతాల రైతులకు ఊరట లభిస్తుందని చెప్పారు. వర్షపాతం లోటు ఉన్న అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో తృణధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు కూడా కీలకమని సీఎం జగన్ చెప్పారు. రైతు భరోసా అమలయ్యేలోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు అందితే చాలా వెసులు బాటు ఉంటుందన్నారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతుల కోసం ఏమైనా చేయడానికి తాము సిద్ధమన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని అందించాలని సీఎం చెప్పారు.

Good news
AP
Farmers
cm jagan
Marketing
profits

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు