డిఎల్ రాజకీయ పయనమెటు : వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైందా ?

Submitted on 15 March 2019
Former minister DL Ravindra Reddy is ready to join the YCP

కడప : మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారు. అందుకోసం ఆయన హైదరాబాదులో చక్రం తిప్పుతున్నారు. సీనియర్ నేత అయిన డీఎల్‌ ఏ పార్టీలో చేరుతున్నాడా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. వీటన్నిటికీ చమరగీతం పాడుతూ ఆయన తన రాజకీయ రంగ ప్రవేశాన్ని త్వరలో ప్రకటించబోతున్నారు.

కడప జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. గత 5 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తిరిగి రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారు. నిన్న మొన్నటి వరకు ఏపార్టీ తీర్థం పుచ్చుకుంటారా అనే విషయంపై గందరగోళం నెలకొంది. అయితే గత కొంతకాలంగా ఆయన వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరిపినట్లు సమాచారం. 

డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకుంటే, మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయినా డీఎల్‌ స్పందించిన దాఖలాలు లేవు. ఎవరేమి అనుకున్నా తాను మాత్రం తన పని తను చేసుకు పోతున్నారు. రాజకీయాల్లోకి రావట్లేదు అంటూనే.. వైసీపీ అధినేతని ఎందుకు కలిశారు.. ఆదివారం కార్యకర్తల సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు.. కార్యకర్తల సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తును వెల్లడిస్తా అని ఎందుకు అన్నారు.. వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ .. డీఎల్ తప్పకుండా క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారు. మరి ఇప్పటికే జిల్లాలో అన్ని ఎమ్మెల్యే స్థానాలు భర్తీ అయ్యాయి కదా, మరి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దానికి కూడా ఒకటే సమాధానం వినిపిస్తోంది. కడప పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారని.. ఎవరికీ అంతుచిక్కని విధంగా రాజకీయ పావులు కదిపిన ఆయన.. తన సీనియార్టీని నిరూపించుకుంటూ.. అందుకు తగిన పదవి కోసం ప్రయత్నిస్తూ వస్తున్నారు.

జగన్‌ పాదయాత్ర ప్రారంభించినప్పుడు తన సన్నిహితుల దగ్గర రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ కుటుంబం నుంచి తాను తప్ప మరెవరు పోటీ చేయడం లేదని చెప్పడం ఇందుకు నిదర్శనం. 2014లో కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలుపొందిన వైఎస్ అవినాష్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో అవకాశం లేదని చెప్పవచ్చు. డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలోకి వస్తే అటు మైదుకూరు నియోజకవర్గంతో పాటు ఇటు కడప పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవచ్చన్నది జగన్ అభిమతం. అంతేకాకుండా సీనియర్ నాయకుడు మంత్రి ఆది నారాయణ రెడ్డికి మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి సమఉజ్జి అని కూడా చెప్పవచ్చు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కడప జిల్లా రాజకీయాలను శాసించిన వ్యక్తిగా.. డీఎల్‌కు పేరుంది. ఆ ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసం కడప పార్లమెంటు స్థానం నుంచి ఆయన్ని వైసీపీ బరిలో దించనున్నట్లు సమాచారం.

డిఎల్ రవీంద్రా రెడ్డి లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసి చర్చలు జరపడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వైసీపీ ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఈ తరుణంలో మాజీ మంత్రి డిఎల్ రవీందర్ రెడ్డి, జగన్ భేటీ చర్చాంశనీయమైంది.

former minister
DL Ravindra Reddy
ready to join
YCP
kadapa

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు