బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటన : 23కు చేరిన మృతుల సంఖ్య

Submitted on 5 September 2019
Fireworks factory explosion in punjab : 23 workers died

పంజాబ్ లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో 23 కు చేరిన మృతుల సంఖ్య చేరింది. మరో 27 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో బుధవారం (సెప్టెంబర్ 4, 2019) సాయంత్రం 4 గంటలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బటాలా ప్రాంతంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. 

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు భవనాలు కూలిపోయాయి. దగ్గర్లోని కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని వాహనాలు ఎగిరి సమీపంలోని కాలువలో పడిపోయాయి. పేలుడు ప్రకంపనలకు కిలోమీటర్‌ దూరంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి. చాలామంది క్షతగాత్రుల తల, కాళ్లకు గాయాలయ్యాయి.

బటాలా దుర్ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. బటాలా అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఈ విచారణ చేపడతారని వెల్లడించారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ మంత్రి రాజేందర్‌ సింగ్‌కు సూచించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50,000, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 వేలు నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గురుదాస్‌పూర్‌ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. 

బటాలా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోవడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బటాలా దుర్ఘటనపై గురుదాస్‌పూర్‌ ఎంపీ సన్నీడియోల్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

Also Read : ఇసుక ఇక చవక : టన్ను రూ.375
 

 

fireworks factory
explosion
Punjab
23 workers
died

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు