భక్తులకు శుభవార్త : రూ.10వేలు ఇస్తే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం

Submitted on 20 October 2019
donate 10 thousand for vip darshan at tirumala

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇకపై సాధారణ భక్తులు కూడా వీఐపీల్లాగా బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఇకపై మంత్రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎలాంటి రెకమెండేషన్ లేఖలు అక్కర్లేదు. సులువుగా వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. రూ.10వేలు విరాళంగా ఇస్తే చాలు.. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 

ఈ మేరకు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. అదే శ్రీవాణి ట్రస్టు. ఈ ట్రస్టుకు రూ.10వేలు విరాళం ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. దీనికి టీటీడీ అంగీకారం తెలిపింది.

వీఐపీ బ్రేక్ దర్శనం కోసం శ్రీవాణి(శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ) ట్రస్ట్ అనే స్కీమ్ తీసుకొచ్చింది టీటీడీ. ఈ స్కీమ్ కింద రూ.10వేలు డొనేషన్లు ఇచ్చిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఇస్తారు. ఈ పథకం ద్వారా దళారులకు చెక్ చెప్పొచ్చని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్ల విషయంలో అక్రమాలకు తెరపడుతుందన్నారు.


విరాళాల రూపంలో శ్రీవాణి ట్రస్ట్ కి అందిన డబ్బుతో కొత్త ఆలయాల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆలయాల అభివృద్ధి కోసమూ ఉపయోగిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఒక వేళ కుటుంబంలో 5మంది ఉంటే.. ఆ కుటుంబం రూ.50వేలు డొనేషన్ రూపంలో ఇస్తే సరిపోతుంది. ఆ కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. డొనేషన్లతో పాటు భక్తులు వీఐపీ దర్శనం టికెట్ కూడా కొనొచ్చు. దాని ధర రూ.500. గతంలో శ్రీవారి వీఐపీ దర్శనం కావాలంటే ప్రజాప్రతినిధులు లేదా ప్రముఖలతో లేఖలు తీసుకురావాల్సి వచ్చేది. అయితే, అందరికీ నేతలు, ప్రముఖుల సిఫారసు లేఖలు దొరికే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో శ్రీవాణి ట్రస్టు స్కీమ్ అమలు చేస్తే బాగుంటుందని భక్తులు అంటున్నారు.

Donate
10 thousand
VIP darshan
Tirumala
TTD
devotees

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు