షీలా దీక్షిత్ దక్షత : కార్యకర్త స్థాయి నుంచి సీఎం అయ్యారు

Submitted on 20 July 2019
Delhi Ex CM Sheela Deekshit Biography

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి మూడుసార్లు సీఎంగాను ఒక సారి లోక్ సభ సభ్యురాలిగా పని చేసి తొలి నుంచి కడ దాకా కాంగ్రెస్ పార్టీ లోనే తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్. రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగించిన ఆమె.. యూపీయే చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి అత్యంత ఆప్తురాలుగా పేరు పొందారు. 1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తల లో జన్మించిన షీలా కపూర్‌.. ఢిల్లీ యూనివర్సిటీలో విద్య నభ్యసించారు. కాలేజీ రోజుల నుంచే కాంగ్రెస్‌ కార్యకర్తగా గుర్తింపు పొంది అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత కాంగ్రెస్‌ మహిళా విభాగానికి నాయకత్వం వహించిన షీలా.. ఇందిర గాంధీ ట్రస్ట్‌ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 

మాజీ ప్రధాని ఇందిర గాంధీ మరణాంతరం జరిగిన ఎన్నికల్లో (1984) ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. అప్పుడు మొదలైన ఆమె ప్రస్థానం చివరి వరకు కాంగ్రెస్‌తోనే కొనసాగింది. తొలిసారి ఎంపీగా గెలిచి రాజీవ్‌ గాంధీ మంత్రి వర్గంలో కేంద్రమంత్రిగా, కేంద్ర మహిళా కమిషన్‌ సభ్యురాలిగా, లోక్‌సభ అంచనాల కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ఆ తరువాత 1998లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈస్ట్‌ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి లాల్‌బిహరి తివారీ చేతిలో తొలిసారి ఓడిపోయారు. ఆ ఓటమే ఆమెకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. 1998లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆమె సీఎం పదవిని అలంకరించారు. అప్పటి నుంచి 2013 వరకు ఆమె ఢిల్లీ సీఎం పదవిలో కొనసాగారు. ఢిల్లీలో రెండు సార్లు  గోలే మార్కెట్‌, ఓసారి న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు. 2012లో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో ఏర్పడిన ఆమ్‌ఆద్మీ పార్టీ చేతిలో సీఎంగా పరాజయాన్ని చవి చూశారు. ఢిల్లీకి సుదీర్ఘ కాలం పనిచేసిన సీఎం గా ఆమె పేరు పొందారు. 1998 నుంచి 2013 వరకు  వరుసగా  దాదాపు 15 ఏళ్ళ పాటు 3 పర్యాయాలు ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 

ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ఆమెను కాంగ్రెస్ పార్టీ 2014  ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేరళ గవర్నర్ గా నియమించింది. ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవటంతో  షీలా దీక్షిత్ కూడా తన గవర్నర్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి పార్టీ పటిష్టానికి కృషి చేశారు. 2017  లో ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని బ్రాహ్మణ వర్గానికి చెందిన షీలాను కాంగ్రెస్ పార్టీ  యూపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ పార్టీ అధికారంలోకి రాలేరకపోయింది.  ఒక రాష్ట్రానికి సీఎం గా పని చేసి మరో రాష్ట్రానికి సీఎం అభ్యర్ధిగా ప్రకటించబడిన వ్యక్తిగా కూడా షీలా ఘనత దక్కించుకున్నారు.  ఆ తర్వాత ఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రీవాల్ పై  ఆమె పెద్ద పోరాటమే చేశారు. 81 ఏళ్ళ వయస్సులో కూడా ఆమె ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీ బీజేపీ చీఫ్ మనీష్ తివారీ చేతిలో ఘోర పరాజయం పొందారు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోంటున్నారు. గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 81 ఏళ్ల వయస్సులో శనివారం 2019 జులై 20వ తేదీన  షీలా దీక్షిత్ ఢిల్లీ లోని ఎస్కార్ట్స్ ఆస్పత్రిలో  తుది శ్వాస విడిచారు.  షీలా దీక్షిత్ భర్త పేరు వినోద్ దీక్షిత్. ఆమెకు కుమారుడు సందీప్ దీక్షిత్, కుమార్తె లతిక  ఇద్దరు పిల్లలు ఉన్నారు.  షీలాదీక్షిత్ మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు.

Congress
sheela dixit
Delhi Ex CM
Rahul gandhi
Sonia Gandhi

మరిన్ని వార్తలు