మూసీలో మృతదేహాలు : నరబలి ఇచ్చారా

Submitted on 23 January 2019
Dead Bodies Found In Musi River

హైదరాబాద్: లంగర్‌ హౌజ్‌‌లో మృతదేహాల కలకలం చెలరేగింది. మూసీనదిలో ఇద్దరు గుర్తుతెలియని మహిళల మృతదేహాలు బయటపడటం సంచలనం రేపింది. మహిళలను చంపిన దుండగులు  మృతదేహాలను మూసీ నదిలో పారేశారు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేపట్టారు.

 

2019, జనవరి 22వ తేదీ మంగళవరం ఉదయం మహిళల హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తలపై బలమైన గాయాలు ఉండటంతో క్షుద్రపూజల కోసమే నరబలి ఇచ్చారని  పోలీసులు అనుమానిస్తునారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. 22వ తేదీ మంగళవారం పౌర్ణమి కావడంతో క్షుద్రపూజలు జరిగి ఉండొచ్చనే  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారిని ఎక్కడో చంపేసి నదిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 2018లో చిలకానగర్‌లో ఓ పసిపాపను నరబలి ఇచ్చాక మృతదేహాన్ని  మూసీలో పారేసిన సంగతి తెలిసిందే.

 

మహిళలను సమీపంలోని కల్లు కాంపౌండ్‌ నుంచి తీసుకొచ్చి చంపారా? లేక ఎక్కడైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2018లోనూ  చిలుకానగర్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పౌర్ణమి రోజున ఓ చిన్నారిని నరబలి ఇచ్చాక నిందితుడు మూసీలో పారేశాడు. ఇప్పుడు చోటు చేసుకున్న ఘటన కూడా అదే తరహా  ఉదంతమేనా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రాథమిక ఆధారాలతో 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలుగా గుర్తించారు. ఓ మృతదేహానికి తల వెనుక భాగంలో, మరోదానికి  కన్ను, నుదురు ప్రాంతాల్లో గాయాలను గుర్తించారు. మృతదేహాలు కుళ్లకపోవడంతో హత్యలు సోమవారం రాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

 

ఈ రెండు మృతదేహాల ఒంటి నిండా పసుపు ఉంది. దీనికితోడు 2018 జనవరిలో పౌర్ణమి తర్వాతి రోజు ఉప్పల్‌ చిలుకానగర్‌లోని రాజశేఖర్‌ అనే వ్యక్తి ఇంటిపై చిన్నారి మృతదేహం కనిపించింది.  అదే రీతిలో ఇప్పుడు పౌర్ణమి మరుసటి రోజు ఈ రెండు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ఇది కూడా నరబలే అని పుకార్లు చెలరేగాయి. పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదని, గాయాలు  సైతం అలాంటి స్థితిలో లేవని పేర్కొంటున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ ఏ విషయం నిర్ధారించలేమని పోలీసులు  అంటున్నారు. మొత్తంగా జంట హత్యలు నగరంలో కలకలం రేపాయి.

dead bodies
musi river
Hyderabad
langerhouse
nara bali
black magic
langar house
human sacrifice

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు