వీడియో : తండ్రి మరణం తట్టుకోలేక.. కుటుంబసభ్యుల కళ్లముందే కూతురు ఆత్మహత్య

Submitted on 19 February 2020
daughter commits suicide

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మరణం తట్టుకోలేకపోయిన కూతురు ఆత్మహత్య చేసుకుంది. నువ్వు లేని జీవితం నాకొద్దు అంటూ ప్రాణం తీసుకుంది. నేనూ నీ దగ్గరికే వచ్చేస్తున్నా నాన్నా..అంటూ సూసైడ్ చేసుకుంది. గుండెలను పిండే ఈ హృదయవిదారక ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి దగ్గర జరిగింది. 

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన తండ్రి మరణం తట్టుకోలేక కూతురు గోదావరి నదిలో దూకింది. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన అరవెల్లి వసంతం సోమవారం(ఫిబ్రవరి 17,2020) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయనను కరీంనగర్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ వసంతం మంగళవారం(ఫిబ్రవరి 18,2020) మృతి చెందాడు. వసంతం మృతదేహాన్ని కుటుంబసభ్యులు అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మరో కారులో వెళ్తున్న వసంతం కూతురు సాయిప్రియ(32) వాంతులు వస్తున్నాయని చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు గోదావరి నది బ్రిడ్జిపై కారుని పక్కకు ఆపారు. కిందకు దిగిన సాయిప్రియ కుటుంబసభ్యుల కళ్లముందే నదిలోకి దూకేసింది. దీంతో అంతా షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. సాయిప్రియ నదిలో గల్లంతైంది. 

ఇంటి పెద్దను కోల్పోయి అసలే ఆ కుటుంబం తీరని విషాదంలో ఉంది. ఇంతలో కూతురు.. కళ్ల ముందే నదిలోకి దూకేయడం మరింత విషాదం నింపింది. గంటల వ్యవధిలో తండ్రీ, కూతురు చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయిప్రియ శిశు సంక్షేమ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. కారు దిగిన సాయిప్రియ నదిలోకి దూకిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఓవైపు వసంతం అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కూతురు సాయిప్రియ నదిలో గల్లంతైంది. సాయిప్రియ మృతదేహం కోసం జాలర్లు నదిలో చాలాసేపు గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. చీకటి పడటంతో గాలింపు చర్యలు కష్టమయ్యాయి. బుధవారం(ఫిబ్రవరి 19,2020) ఉదయం నుంచి మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నదిలో నీరు ఎక్కువగా ఉండటంతో.. గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

father die
daughter die
godavarkani
Bridge
Suicide
Fell
Mancherial

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు