రేప్ లు, హత్యలు, ఆత్మహత్యలు, చోరీలు తగ్గాయి.. లాక్‌డౌన్‌తో 23శాతం పడిపోయిన క్రైమ్ రేట్

Submitted on 9 April 2020
crime rate reduced in telangana due to lockdown

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో చాలా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి ఏకైక ఆయుధం లాక్ డౌన్ అని కేంద్రం చెప్పింది. అందుకే దాన్ని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా.. ఓ రకంగా మంచి కూడా జరుగుతోంది. లాక్ డౌన్ కారణంగా కరోనా మహమ్మారినే కాదు నేరాలు కూడా కట్టడి అయ్యాయి. అవును తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పడిపోయింది. రేప్ లు, హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు తగ్గాయి. నేరాల రేటు 23శాతం తగ్గింది.

గణనీయంగా తగ్గిన నేరాలు:
కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం నేరాలు 23.63 శాతం తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడం, గ్రామం నుంచి నగరం వరకు అడుగడుగునా పోలీసుల గస్తీ ముమ్మరం కావడంతో నేరస్తుల్లోనూ భయం మొదలైంది. ఫలితంగా హత్యలు, దోపిడీలు, దొంగతనాల్లాంటి అనేక నేరాలు గణనీయంగా తగ్గినట్టు పోలీస్‌శాఖ విడుదలచేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

లాక్‌డౌన్‌కు ముందు 12వేల కేసులు, లాక్ డౌన్ తర్వాత 6వేల కేసులు:
లాక్‌డౌన్‌కు ముందు 21 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల నేరాలకు సంబంధించి మొత్తం 12,403 కేసులు నమోదవగా.. లాక్‌డౌన్‌ విధించిన మార్చి 22 నుంచి సోమవారం(ఏప్రిల్ 6,2020) వరకు 6,766 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కేసుల సంఖ్య హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,618 నుంచి 853కు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,882 నుంచి 610కి, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 1,552 నుంచి 777కు తగ్గినట్టు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు 21 రోజుల్లో 15 దోపిడీలు జరుగగా.. లాక్‌డౌన్‌ సమయంలో వీటి సంఖ్య నాలుగుకు తగ్గింది. అలాగే దొంగతనాల సంఖ్య 1,108 నుంచి 262కు, హత్యల సంఖ్య 32 నుంచి 10కి, కిడ్నాప్‌లు 210 నుంచి 29కి, హత్యాప్రయత్నాలు 88 నుంచి 24కు, మిస్సింగ్‌ కేసులు 1,237 నుంచి 414కు తగ్గినట్టు వివరించారు.

లాక్‌డౌన్‌లోనూ పెరిగిన రోడ్డు ప్రమాదాలు:
లాక్‌డౌన్‌ సమయంలో వాహన రాకపోకలు గణనీయంగా తగ్గినప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏదో అత్యవసర పనులంటూ రోడ్లమీదకు వస్తున్న యువత.. ఖాళీగా ఉన్న రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. లాక్‌డౌన్‌ విధించిన మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 6 వరకు జరిగిన 199 రోడ్డు ప్రమాదాల్లో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 128 మంది గాయపడ్డారు.

LOCKDOWN
Telangana
crime rate
REDUCE
rapes
murders
Robbery
Suicide
road accidents
coronavirus

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు