coronavirus-more-effective-15-districts

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 15 జిల్లాలు ఇవే.. ఇక్కడ కట్టడి చేస్తే మహమ్మారిపై విజయం సాధించినట్టే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజూ కొత్త కేసులు బయపడుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 30వేలకు చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనాకు మందు లేకపోవడంతో నివారణే మార్గమైంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. 

9 రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువ:
మన దేశంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికం కేవలం 9 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అందులోనూ 15 జిల్లాల్లోనే తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్, ఏపీ నుంచి కర్నూలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో కొవిడ్-19ను అరికడితే దేశంలో ఈ మహమ్మారి నియంత్రణలోకి వచ్చినట్లే. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మంగళవారం (ఏప్రిల్ 28,2020) వెల్లడించారు. కొవిడ్ పై పోరాటానికి కేంద్రం ఏర్పాటుచేసిన 11 సాధికార సంఘాల్లో ఒకదానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. 87.13% వరకు కేసులు 15 జిల్లాల నుంచే వచ్చాయనీ, అక్కడ కట్టడి చర్యలు, పరీక్షలు, చికిత్సలపై పర్యవేక్షణ మరింత పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
తెలంగాణలో గుర్తించదగ్గ స్థాయిలో మెరుగుదల:
ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల పరిస్థితులను రోజువారీగా, వారాల ప్రకారం పరిశీలిస్తే తెలంగాణలో గుర్తించదగ్గ స్థాయిలో మెరుగుదల కనిపించిందని చెప్పారు. కరోనాను పూర్తిస్థాయి నియంత్రణలోకి తెచ్చిన కేరళను అన్ని రాష్ట్రాలూ అనుసరించాలని సూచించారు. దేశంలో పరీక్షలు చేసిన వారిలో సగటున 4.7% మందికి ఇదివరకు పాజిటివ్ రాగా ఇప్పుడు అది తగ్గడం సంతోషకరమని అన్నారు. పరీక్షలు తక్కువగా చేస్తుండటంవల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కొందరు అంటున్నారని, సంఖ్యను రోజుకు 40వేలకు పెంచిన తర్వాత పాజిటివ్ కేసులు 4.1 శాతానికి తగ్గిపోవడం శుభసూచకమని చెప్పారు.

తెలంగాణలో ఇలా, ఏపీలో అలా:
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత 5 రోజులుగా అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1009 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 25మంది చనిపోయారు. ఏపీ విషయానికి వస్తే.. పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఏపీలో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. 5 రోజులుగా పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

సరాసరిగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. పరీక్షలు ఎక్కువ చేయడంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు ఏపీలో 1259 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 31మంది చనిపోయారు. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. రెండు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువశాతం హైదరాబాద్, కర్నూలు జిల్లాల నుంచే ఉంటున్నాయి.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 9 రాష్ట్రాల్లోని 15 జిల్లాలు ఇవే..
* ఢిల్లీ రాష్ట్రంలో ఢిల్లీ జిల్లా
* మహారాష్ట్ర రాష్ట్రంలో ముంబై జిల్లా
* మహారాష్ట్ర రాష్ట్రంలో పుణె జిల్లా
* మహారాష్ట్ర రాష్ట్రంలో ఠాణే జిల్లా
* గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ జిల్లా
* గుజరాత్ రాష్ట్రంలో సూరత్ జిల్లా
* గుజరాత్ రాష్ట్రంలో వడోదరా జిల్లా
* మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ జిల్లా
* మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ జిల్లా
* రాజస్తాన్ రాష్ట్రంలో జైపూర్ జిల్లా
* రాజస్తాన్ రాష్ట్రంలో జోధ్ పూర్ జిల్లా
* తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా
* ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా జిల్లా
* తమిళనాడు రాష్ట్రంలో చెన్నై జిల్లా

Related Posts

Trending

Latest News