coronavirus-legalisation-ball-tampering-could-be-considered

కరోనా ఎఫెక్ట్, ఇకపై బాల్ టాంపరింగ్ చట్టబద్ధం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

క్రికెట్ లో బాల్ టాంపరింగ్ తీవ్రమైన నేరం. బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికితే కఠినంగా శిక్షిస్తారు. బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికిన కొందరు తమ కెరీర్ ను కోల్పోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడి శిక్షను అనుభవించారు. పేరు, ప్రతిష్టలు పోయాయి. అయితే ఇకపై టాంపరింగ్‌ నేరం కాకపోవచ్చు. టాంపరింగ్ చేసినా ఎలాంటి శిక్షా ఉండకపోవచ్చు. ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీయడాన్ని నేరంగా పరిగణిస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తమ నిబంధనలు సడలించే అవకాశం కనిపిస్తోంది. బాల్‌ టాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం ఐసీసీ పరిశీలనలో ఉంది. అంపైర్ల పర్యవేక్షణలో బంతిని పాలిష్‌ చేసేందుకు అనుమతిస్తారు. దీనికి కారణం కరోనా వైరస్.

బాల్ స్వింగ్ అవ్వాలంటే పాలిష్ అవసరం:
పరిమిత ఓవర్ల క్రికెట్ లో తెల్ల బంతితో సమస్య కాకున్నా… టెస్టుల్లో ఎర్ర బంతితో పేసర్లు ప్రభావం చూపించాలంటే దానిని పదే పదే పాలిష్‌ చేయడం అవసరం. అలా చేస్తేనే ఇరు వైపులా స్వింగ్‌ను రాబట్టేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు నిబంధనలకు లోబడి నోటి ఉమ్ము (సలైవా)ను బౌలర్లు వాడుతున్నారు. అయితే కరోనా దెబ్బకు బంతిపై ఉమ్మి రుద్దాలంటేనే బౌలర్లు వణికిపోయే పరిస్థితి ఉంది. వైరస్ లక్షణాలున్న వ్యక్తి బంతిపై ఉమ్మితే.. మ్యాచ్‌లో పాల్గొన్న వాళ్లందరికీ కరోనా సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ క్రికెట్‌ మొదలయ్యాక బౌలర్లు, ఫీల్డర్లు బంతిని ఈ తరహాలో పాలిష్‌ చేయాలంటే కష్టమే. దీనిపై నిషేధాజ్ఞలు కూడా విధించొచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బంతి మెరుపు కోసం ఉమ్మిని వాడకుండా ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని ఐసీసీ మెడికల్‌ కమిటీ సూచించింది. బయటి వస్తువుల ద్వారా కూడా టాంపరింగ్‌ చేసే అవకాశం కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. మే నెలలో జరిగే టెక్నికల్‌ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

 

టాంపరింగ్ కు ప్రత్యేక పదార్థం:
టాంపరింగ్‌ను ఐసీసీ నిషేధించినా… మ్యాచ్‌ చేజారిపోతున్న దశలో చాలామంది వేర్వేరు వస్తువులతో బంతి ఆకారాన్ని మారుస్తుంటారు. స్మిత్, వార్నర్‌ ఉదంతంలో స్యాండ్‌ పేపర్‌ (ఉప్పు కాగితం) వాడగా…గతంలో సీసా బిరడా, చెట్టు జిగురు, వ్యాస్‌లీన్, ప్యాంట్‌ జిప్, జెల్లీ బీన్స్, మట్టి… ఇలా కాదేది టాంపరింగ్‌కు అనర్హం అన్నట్లుగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్‌కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్‌జీ, కూకాబుర్రా, డ్యూక్స్‌లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనేది కీలక సూచన. ఈ రకంగా చూస్తే బంతి మెరుపు కోసం లెదర్‌ మాయిశ్చరైజర్, మైనం, షూ పాలిష్‌ కొంత వరకు మెరుగ్గా ఫలితమిచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలనలో తేలింది. చివరకు ఐసీసీ దేన్ని ఓకే చేస్తుందో చూడాలి.

 

బాల్ ట్యాంప‌రింగ్‌ చ‌ట్టబ‌ద్ధం:
ఐసీసీ మెడికల్‌ కమిటీ కూడా ఇక నుంచి బంతికి ఉమ్ము పూయడం ఏమాత్రం మంచిది కాదని గురువారం(ఏప్రిల్ 23,2020) జరిగిన ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో స్పష్టం చేసింది. దీంతో ఉద్దేశ‌పూర్వ‌కంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీయ‌డాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తున్న ఐసీసీ.. బాల్ ట్యాంప‌రింగ్‌ను చ‌ట్టబ‌ద్ధం చేయాల‌నే ప్ర‌తిపాద‌నను ప‌రిశీలిస్తున్న‌ది. అయితే అంపైర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బంతిని పాలిష్ చేసేందుకు అనుమ‌తిలిచ్చే యోచ‌న‌లో ఉందని సమాచారం.

Related Posts