coronavirus danger bells in greater hyderabad

గ్రేటర్ లో కరోనా కల్లోలం.. రాష్ట్రంలో 229 కోవిడ్ కేసులు.. వీటిలో 100కుపైగా కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.(కరోనా విలయ తాండవం, 11లక్షలకు చేరువలో కొవిడ్ కేసులు)

రాష్ట్రంలో 229 కరోనా కేసులు.. వీటిలో వందకుపైగా కేసులు గ్రేటర్ హైదరాబాద్ లోనే:
తెలంగాణవ్యాప్తంగా శుక్రవారం(ఏప్రిల్ 3,2020) రాత్రి వరకు 229 కరోనా కేసులు నిర్ధారణ కాగా, వీటిలో 100కు పైగా కేసులు గ్రేటర్‌లోనే నమోదయ్యాయి. హైదరాబాద్‌ జిల్లాలో 75..రంగారెడ్డి జిల్లాలో 16, మేడ్చల్‌ జిల్లాలో 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 11మంది కరోనాతో మృతి చెందగా, వీరిలో ఎనిమిది మంది గ్రేటర్‌ వాసులే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి చాపకింద నీరులా విస్తరిస్తుండటం..మరో వైపు గత నాలుగు రోజుల నుంచి రోజుకు సగటున 20 నుంచి 30పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో మహానగరంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రోగుల విషయంలో అత్యంత గోప్యతను పాటిస్తూ…వివరాలు వెల్లడించడం లేదనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

రానున్న వారం రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలి:
మార్చి 2న తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత 30వ తేదీ వరకు 77 కేసులు నమోదైతే…ఆ తర్వాత కేవలం మూడు రోజుల్లోనే మరో 77 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 60 శాతం కేసులు హైదరాబాద్‌ జిల్లావే. వైరస్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ దగ్గర పడుతున్న కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతుండటం, వైరస్‌ మరింత బలపడి విస్తరించే ప్రమాదం ఉండటంతో గ్రేటర్‌ వాసుల్లో ఆందోళన నెలకొంది. వచ్చే వారం రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  

గ్రేటర్ లో కరోనా మృతులు వివరాలు:
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 మంది కరోనాతో చనిపోయారు. వీరిలో ఒకరు నిజామాబాద్, ఇంకొకరు గద్వాల్, మరొకరు నిర్మల్‌కు చెందిన వారు. మిగిలిన 8మంది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వారే. పాజిటివ్‌ కేసుల్లోనే కాదు..మరణాల్లోనూ గ్రేటరే టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. మార్చి 28న తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైంది. 

* ఖైరతాబాద్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు(74) కరోనాతో చనిపోయాడు. 
* ఆ తర్వాత రెండు రోజులకు గాంధీ ఆస్పత్రిలో చంచల్‌గూడకు చెందిన ఉర్దూ పత్రిక జర్నలిస్టు(58) సహా దారుషిఫాకు చెందిన వృద్ధుడు (65) మృతి చెందాడు. 
* అపోలో ఆస్పత్రిలో యూసఫ్‌గూడకు చెందిన వ్యక్తి(55) చనిపోయాడు. 
* మార్చి 31న న్యూ మలక్‌ పేటకు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు యశోద ఆస్పత్రిలో మృతి చెందాడు. 
* ఏప్రిల్‌ 1న కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి (56) గాంధీ ఆస్పత్రిలో చనిపోయాడు. 
* వీరిలో ఒక్క జర్నలిస్టు మినహా మిగిలిన వారంతా ఢిల్లీలో జమాత్‌కు వెళ్లి వచ్చిన వారే.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం
* 205 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 11లక్షలకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య
* ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 59వేల 140మంది మృతి
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10లక్షల 98వేలకుపైగా కేసులు
* ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 82వేల కొత్త కేసులు, 6వేల మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 2.28 లక్షల మంది

* అమెరికాలో విజృంభిస్తున్న కరోనా వైరస్, 2.76లక్షలు దాటిన కరోనా కేసులు
* అమెరికాలో నిన్న(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 32వేలకు పైగా కొత్త కేసులు నమోదు
* అమెరికాలో నిన్న(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 1,320మంది మృతి
* అమెరికాలో ఏడున్నర వేలకు చేరిన మరణాలు, ఇప్పటివరకు 7వేల 391మంది మృతి
* అమెరికా, స్పెయిన్, బ్రిటన్ లో పెరిగిపోతున్న కరోనా మరణాలు

* న్యూయార్క్ లో కరోనా మృతుల ఖననానికి ఇబ్బందులు, స్థలాల కొరత
* ఒక్క న్యూయార్క్ లోనే దాదాపు లక్ష కేసులు, 3వేల మరణాలు
* న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్ లలో చైనాను మించిన కేసులు
* ఈ మూడు రాష్ట్రాల్లో లక్షా 20వేల కరోనా కేసులు
* అమెరికాలో 2 వారాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న కోటి మంది

* అమెరికాలో 7వేల 391 మంది, ఇటలీలో 14వేల 681 మంది, స్పెయిన్ లో 11వేల 198 మంది మరణం
* ఫ్రాన్స్ లో 6వేల 507, చైనాలో 3వేల 322, ఇరాన్ లో 3వేల 294, యూకేలో 3వేల 605, నెదర్లాండ్స్ లో 1,487, జర్మనీలో 1,275, బెల్జియంలో 1,143, స్విట్జర్లాండ్ లో 591 కరోనా మరణాలు
* న్యూయార్క్ లో వైద్య రంగం సంక్షోభం, నిత్యావసరాల కొరత
* ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, యూకేలో వేలల్లో కేసులు
* అమెరికా తర్వాత ఇటలీలోనే అత్యధికంగా కరోనా మరణాలు
* ఇటలీలో లక్షా 20వేలు, స్పెయిన్ లో లక్షా 19వేలు, జర్మనీలో 91వేలు, ఫ్రాన్స్ లో 64వేలు, ఇరాన్ లో 53వేల కరోనా కేసులు
* టర్కీ, బెల్జియం, స్విట్జర్లాండ్, కెనడాల్లోనూ వేలల్లో కేసులు

* భారత్ గత ఆరు రోజుల్లో మూడు రెట్లు పెరిగిన కరోనా కేసులు
* దేశంలో ఇప్పటివరకు 3వేల 108 కేసులు
* శుక్రవారం(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 508 కొత్త కేసులు, 12 మరణాలు
* ఇప్పటివరకు 90మంది కరోనాతో మృతి
* కరోనా నుంచి కోలుకున్న 229 మంది
* మహారాష్ట్రలో అత్యధికంగా 490 కేసులు
* తమిళనాడులో 411 మందికి వైరస్
* రెండు రోజులుగా దేశంలో నమోదైన కొవిడ్ పేషెంట్లలో 647మంది ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు హాజరైన వాళ్లే

Related Posts

Trending

Latest News