తెలంగాణలో 404కు చేరిన కరోనా కేసులు...11 మంది మృతి 

Submitted on 7 April 2020
coronavirus cases reaching to 404 in Telangana, 11 people died with virus

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటింది. ఇవాళ మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 404కి చేరింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 150 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 11 మంది చనిపోయారు. ఇప్పటివరకు 45 మంది పూర్తిగా కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఆస్పత్రుల్లో 348 మందికి చికిత్స 
ప్రస్తుతం 348 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లో మర్కజ్ కేసులతో లింకున్న వారందరి పరీక్షలన్నీ పూర్తికానున్నాయి. అందులో ఎంత మందికి పాజిటివ్‌గా తేలుతుందన్నది ఆందోళన కలిగిస్తోంది. కాంటాక్ట్ కేసులు పెరిగితే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మహబూబ్ నగర్ జిల్లాలో 23 రోజుల పసికందుకు కరోనా 
మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా కలవరం నెలకొంది. 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నానికే మహబూబ్ నగర్ జిల్లాలో మూడు కేసుల్లో పాజిటివ్ వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో దీని  ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు షాద్ నగర్, మహబూబ్ నగర్ పట్టణాల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కాగా  ఈరోజు  వైరస్ సోకిన 23 రోజుల చిన్నారికి వారి తల్లి తండ్రుల ద్వారా  వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

మర్కస్ యాత్రకు వెళ్ళి వచ్చిన చిన్నారి తల్లితండ్రులు 
ఇటీవలే చిన్నారి తల్లితండ్రులు నిజాముద్దీన్ మర్కస్ యాత్రకు వెళ్ళి వచ్చారని ఆవిషయాన్ని వారు గోప్యంగా ఉంచారని తెలిసింది. వైద్యా శాఖ అధికారులు అక్కడకు చేరుకుని చిన్నారిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందటం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 32 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ఇప్పుడు చిన్నారికి కరోనా  పాజిటివ్ వచ్చిందనే వార్త కలకలం రేపుతోంది. 

కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
తెలంగాణ నుంచి కరోనాను తరిమికొట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గాంధీని పూర్తి కరోనా ఆస్పత్రిగా మార్చిన ప్రభుత్వం..గచ్చిబౌలిలోనూ కరోనా ఆస్పత్రికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కరోనా ఆస్పత్రిలో దాదాపు 1200 మందికి క్వారంటైన్‌ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

గచ్చిబౌలిలో కరోనా ఆస్పత్రిని పరిశీలించిన కేటీఆర్, ఈటెల
ఈ నెల 15లోగా గచ్చిబౌలి ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కేటీఆర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటలతో కలిసి మంత్రి కేటీఆర్...గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న కరోనా ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్...వీలైంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. (ఏపీలో విజృంభిస్తోన్న కరోనా...314కు చేరిన కేసులు...నలుగురి మృతి)

coronavirus
Case
404
Telangana
11 people
die
Hyderabad

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు