corona-cases-slow-down-ghmc

గుడ్‌న్యూస్, గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 35 కంటైన్ మెంట్ జోన్లు రద్దు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొన్ని రోజులుగా కరోనా వైరస్ భయంతో వణికిపోయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు రిలీఫ్ లభించింది. కరోనా కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన వారికి గండం తప్పింది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా 5వ రోజూ గ్రేటర్ వ్యాప్తంగా తక్కువ కేసులు నమోదయ్యాయి. సోమవారం(ఏప్రిల్ 27,2020) కేవలం రెండే కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేసులు తగ్గడంతో పలు ప్రాంతాల్లో కంటెయిన్ మెంట్ జోన్లు ఎత్తివేయడం ప్రారంభించారు అధికారులు. ఇప్పటివరకు 694 కేసులు నమోదు కాగా… వ్యాధి తగ్గడంతో 138 మందిని ఇళ్లకు పంపారు. మిగతా వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 90 శాతం మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

35 ప్రాంతాల్లో కంటెయిన్ మెంట్ జోన్ల తొలగింపు:
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో సర్కారు ఆదేశాలతో జీహెచ్ ఎంసీ కంటెయిన్ మెంట్ జోన్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. వరుసగా రెండు వారాల పాటు కొత్తగా కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదుకాని జోన్లను ఎత్తివేయడం ప్రారంభించింది. తొలి విడతలో నాలుగు రోజుల క్రితం 45 జోన్లను రద్దు చేసింది. తాజాగా మరో 35 ప్రాంతాలను ఎత్తేశారు. రెండో విడత జాబితాలోని ప్రాంతాలు సగం పాతబస్తీకి చెందినవే ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో 129 కంటెయిన్ మెంట్ జోన్లను కొనసాగిస్తున్నారు. క్రమంగా కొత్త కేసులు నమోదవని జోన్లను సైతం తొలగిస్తామని, ఆయా ప్రాంతాల ప్రజలకు కఠిన ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలు మాత్రం యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు.

 

తాజాగా రద్దయిన కంటైన్ మెంట్ జోన్లు ఇవే:
* పాత మలక్ పేట సాద్ మసీద్
* జీవన్ యార్ జంగ్ కాలనీ
* సపోటబాగ్
* ప్రొఫెసర్స్ కాలనీ
* మాదన్నపేట డరబ్ జన్ కాలనీ
* యాఖుత్ పుర ఎస్సార్టీ కాలనీ
* డబీర్ పురా
* మదీన మసీదు
* బార్కస్ మైసారం లైన్స్
* నసీబ్ నగర్
* పూల్ బాగ్ అహ్మద్ కాలనీ
* నూర్ ఖాన్ బజార్
* ఫతేదర్వాజ ఖాజిపుర
* షాఘంజ్
* ఫలక్ నుమా రోషన కాలనీ
* అంజుమన్
* జియాగూడ
* కార్వాన్
* నానల్ గూడ
* అల్ హస్నత్
* మెహబూబ్ కాలనీ
* షౌఖత్ నగర్
* ఓయూ కాలనీ
* ఫిల్మ్ నగర్ బస్తీ
* ఎంఎం పహాడీ జలబాబా నగర్
* పంజాగుట్ట ఠాణా వెనుక వీధి
* జయంత్ నగర్ ఎర్రగడ్డ
* అంబేద్కర్ నగర్
* సాయినగర్
* ఆదిత్యనగర్
* పంజాగుట్ట ఠాణా వెనుక వీధి
* జయంత్ నగర్, ఎర్రగడ్డ
* అంబేద్కర్ నగర్

 

దిల్ సుఖ్ నగర్ లో వ్యాపారికి కరోనా:
దిల్ సుఖ్ నగర్ ప్రాంతం శారదానగర్ కు చెందిన ఓ వ్యాపారికి కరోనా సోకింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఆయన్ను సోమవారం(ఏప్రిల్ 27,2020) గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలాగే అతనితో సంబంధాలు ఉన్న 16 మందిని హోం క్వారంటైన్ లో ఉంచారు. మలక్ పేట గంజిలో వ్యాపారం చేసే బాధితుడికి గత పది రోజులుగా అస్వస్థతగా ఉండటంతో కర్మన్ ఘాట్, కొత్తపేట, వనస్థలిపురంలోని ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించాడు. నయం కాకపోవడంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రికీ వెళ్లారు. చివరకు ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలున్నా వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని… యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆ వ్యాపారితో కాంటాక్ట్ అయిన మొత్తం సిబ్బందిని, కుటుంబ సభ్యులను గుర్తించారు. కుటుంబ సభ్యులను కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. అతనితో పాటు ఉన్న వనస్థలిపురంలోని సమీప బంధువు ఇంటి దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిషేధించారు.

దేశంలో 29వేల 439 కరోనా కేసులు, 931 మరణాలు:
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 29వేల 439కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 931మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6వేల 734. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 3వేల 108కి చేరింది. 54మంది కరోనాతో చనిపోయారు. 877మంది కోలుకున్నారు. మహారాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8వేల 590కి చేరింది. ఇప్పటివరకు 1,282మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో కరోనాతో 27మంది చనిపోయారు.

తెలంగాణలో తగ్గుదల, ఏపీలో పెరుగుదల:
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగింది. గతంలో పోలిస్తే రోజువారీగా కేసుల నమోదు బాగా తగ్గింది. సోమవారం(ఏప్రిల్ 27,2020) కేవలం రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 1003కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 646. ఏపీలో మాత్రం కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,177కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 31మంది చనిపోయారు. 235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 911. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 30.60 లక్షల కేసులు, 2.11లక్షల మరణాలు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30.60 లక్షలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.11లక్షల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9.21లక్షల మంది కోలుకున్నారు.