continue-lockdown-upto-december

డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించాలి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని, లాక్ డౌన్ పై నిర్ణయం తెలుపుతారని సమాచారం. అయితే లాక్ డౌన్ కొనసాగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేయాలని కొందరు, కొనసాగించాలని మరికొందరు కోరుతున్నారు.

కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు:
ఇది ఇలా ఉంటే, తెలంగాణలో డిసెంబర్ వరకు పొడిగించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తతో మే 7 వరకు లాక్‌డౌన్‌ను పెట్టారని…మరి కొన్ని నెలలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఆయన కోరారు. లాక్‌డౌన్ ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని… కరోనా కేసులు పెరగకుండా ఉండాలంటే లాక్‌డౌన్ పొడిగించాల్సిందేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం అని జగ్గారెడ్డి చెప్పారు. ఈ విషయంలో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రాణం మీదకు వచ్చే వరకు తెలియదు:
అమెరికా, ఇటలీ దేశాల మాదిరిగా మన ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఆ సూచన చేశానని జగ్గారెడ్డి వివరించారు. తాను సలహా ఇస్తే ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాలని ఏమీ లేదన్నారు. కొన్ని వర్గాల ప్రజలు మాత్రం లాక్ డౌన్ ను ఎత్తివేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఎవరికైనా ప్రాణం మీదకు వచ్చే వరకు తెలియదని, అది ప్రజల బలహీనత అని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో 4 రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయని ప్రభుత్వం అంటోందని, అది నిజమైతే సంతోషమేనని జగ్గారెడ్డి తెలిపారు. మే 7న సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ఎత్తివేస్తే, దాన్ని ప్రజలు ఆమోదిస్తే సంతోషమే అన్నారు. 

వచ్చే ఏడాది పండుగలను స్వేచ్ఛగా జరుపుకోవచ్చు:
మే తర్వాతి నుంచి అన్ని పండుగలు సామూహికంగా జరుపుకునేవే అని, దాంతో కరోనా ప్రబలిపోయే అవకాశం ఉందని జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి లాక్‌ డౌన్‌ పొడిగింపు ఒక్కటే ఉత్తమం అని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పేరుతో లాక్ డౌన్‌ను ఎత్తేస్తే ఇప్పటివరకూ పడ్డ కష్టమంతా వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌ డౌన్‌ను ఈ ఏడాది పొడిగించుకుంటే వచ్చే ఏడాది పండుగలను స్వేచ్ఛగా జరుపుకోవచ్చని చెప్పారు.
ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, నర్సులకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయలు కలిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే 24 గంటలు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. ఆర్ధికవేత్తలు కూడా ప్రభుత్వాలు ఆర్ధికంగా ఎలా నిలదొక్కుకోవాలనే అంశంపై సూచనలు ఇస్తూ సహకరించాలని తెలిపారు.