తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త : ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల వర్షం

Submitted on 18 June 2019
cm kcr good news for telugu states people

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు ప్రజలకు శుభవార్త వినిపించారు. తాను, జగన్ కలిసి.. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి నీళ్లు అందేలా చూస్తామన్నారు. భవిష్యత్ లో 5వేల టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. అందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. ఏపీ సాగునీటి పారుదల అధికారులు దీనిపై చర్చించడానికి జూన్ 27 లేదా 28 తేదీల్లో హైదరాబాద్ కి వస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. మంత్రివర్గంలో చర్చించిన అంశాలను, కేబినెట్ నిర్ణయాలను కేసీఆర్ మీడియాకు తెలిపారు. ప్రతీ ఏటా 3వేల 500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ, ఏపీకి కలిపి గోదావరిలో 1480 టీఎంసీల నీళ్ల వాటా, కృష్ణాలో 811 టీఎంసీల నీళ్ల వాటా ఉందన్నారు. గోదావరి, కృష్ణాలో కలిపి ఇరు రాష్ట్రాలకు 2వేల 300 టీఎంసీల నీళ్ల వాటా ఉందన్నారు. రెండు నదుల మిగులు జలాలు కూడా ఇరు రాష్ట్రాలు వాడుకోవచ్చని సీఎం తెలిపారు. నికర, వరద జలాలు కలుపుకుని 5వేల టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని వాడుకునే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు.

జగన్ పై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ యువకుడు, ఉత్సాహవంతుడు అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్ సంబంధాలు కోరుకుంటున్నారని చెప్పారు. భేషజాలు పక్కన పెడదామని, అన్ని అంశాల్లో పరస్పరం సహకరించుకుందామని జగన్ తనతో అన్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని కేసీఆర్ తెలిపారు. జల వివాదాలపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు చర్చిస్తారని కేసీఆర్ చెప్పారు. 

పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని ముందుకెళ్తాయన్నారు. ఏపీతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలని మంత్రి వర్గం నిర్ణయించినట్టు కేసీఆర్ చెప్పారు. ఇరు రాష్ట్రాల పరస్పర సహకారం రాబోయే రోజుల్లో చూస్తామన్నారు. గతంలో ఎన్నడూ చూడని మంచి ఫలితాలను అన్ని రంగాల్లో సాధిస్తామని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కర్ణాటక, మహారాష్ట్రతో బస్తీ మే సవాల్ అన్నట్లుగా పరిస్థితి ఉండేదన్నారు. ఇక ముందు అలాంటి పరిస్థితి ఉండదన్నారు. మహారాష్ట్ర సర్కార్ సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 40 లక్షల ఎకరాలకు సాగునీరందడంతోపాటు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీరుతాయని చెప్పారు. 

విజయవాడ, మహారాష్ట్రకు వెళ్లి..ఇద్దరు సీఎంలను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ చీఫ్ గెస్టులుగా హాజరవుతారని కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్ తన సొంత హెలికాప్టర్ లో వస్తారని అన్నారు. మహారాష్ట్ర సీఎం, గవర్నర్, బ్యాంకర్లు 4 హెలికాప్టర్లలో వస్తారని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Telangana CM KCR
Ys Jagan
telangana cabinet
Kaleshwaram
Irrigation
Water
Friendship
Krishna
Godavari

మరిన్ని వార్తలు