chiranjeevi to get rajya sabha seat of ysrcp

రంగంలోకి చిరంజీవి..? పవన్‌కు చెక్‌ చెప్పేందుకు సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అందరిలోనూ ఆశలే.. కానీ అక్కడ ఉన్నవి నాలుగే. పోటీలో మాత్రం ఎందరో.. ఎవరికివ్వాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. చాలా లెక్కలు వేయాల్సిందే. అయినా ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు. ఆ నాలుగింటి కోసం ఏడుగురిని లైన్లో పెట్టారు. వారిలో నుంచి నలుగురికి ఇవ్వాలి. ఆ నలుగురు ఎవరు? మధ్యలో అనుకోని పరిణామాలు ఎదురై.. ఎన్డీయే సర్కారులో చేరాల్సి వస్తే.. కోటాలో కనీసం ఒకటైనా కోత పడుతుంది. అప్పుడు ముగ్గురికే చాన్స్‌.. మరి ఆ లక్కీ పర్సన్స్‌ ఎవ్వరో?

నాలుగు స్థానాల కోసం పరిశీలనలో ఏడుగురి పేర్లు:
ఏపీలో రాజ్యసభ ఎన్నికల కోలాహలం మొదలైంది. రాష్ట్రంలో నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. నలుగురు సభ్యుల పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికలు అనివార్యమైంది. ఈ నాలుగు స్థానాలను గెలుచుకోవడానికి రాష్ట్రంలోని అధికార వైసీపీకే అవకాశాలున్నాయి. దీంతో పోటీ తీవ్రమైంది. నాలుగు స్థానాల కోసం ఏడు పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ఏడుగురిలో నలుగురికి ఖరారు చేసే అవకాశముంది. ఇప్పటికే వైసీపీ సర్కారు రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ప్రస్తుతానికి ఆ అంశం అక్కడ పెండింగ్‌లో ఉంది. ఎన్నికలకు ముందు టికెట్లు ఆశించినవారితో పాటు జగన్‌ పాదయాత్ర సందర్భంగా సహకరించిన నేతలకు మండలిలో స్థానం కల్పిస్తానని హామీలిచ్చారు. కానీ, మండలి రద్దు యోచన నేపథ్యంలో వారందరూ నిరాశలో ఉన్నారు. 

రేసులో చిరంజీవి, అయోధ్యరామిరెడ్డి:
తాజాగా రాజ్యసభకు నలుగురు ఎంపీలకు పంపించే అవకాశం రావడంతో ఆ దిశగా ఎవరికి వారే వైసీపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమకు అవకాశం కల్పించాలంటూ పార్టీ పెద్దలకు అర్జీలు పెట్టుకుంటున్నారట. కానీ, ఇప్పటికే కొందరిని అధిష్టానం ఫిక్స్‌ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఏడుగురి పేర్లు బలంగా ప్రచారంలో ఉన్నాయి. వారిలో అయోధ్యరామిరెడ్డి, బీదా మస్తాన్‌ రావు, మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చిరంజీవి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. వీరిలో నలుగురికి పదవి దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. 

టీటీడీ చైర్మన్‌గా వైవీని తప్పించి రాజ్యసభకు పంపిస్తారా?
ప్రస్తుతం రాష్ట్ర మంత్రులుగా ఉన్న మోపిదేవి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లలో ఇద్దరికీ లేదా ఒక్కరికైతే తప్పకుండా చాన్స్‌ ఉంటుందని చెబుతున్నారు. మండలి రద్దయితే వారిద్దరి మంత్రి పదవులు గల్లంతు తప్పదు. దీంతో వారికి ఎక్కడో ఒక చోట అవకాశం కల్పించాలి. దీంతో రాజ్యసభకు వీరిని పంపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో అధిష్టానం ఉందంటున్నారు. ముఖ్యంగా బోస్‌కు ఆ అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉన్నా మాగుంట శ్రీనివాసులు కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో వైవీకి టీటీడీ చైర్మన్‌గా చాన్స్‌ ఇచ్చారు. కానీ, ఆయన రాజ్యసభ కోరుతున్నాని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వైవీకి రాజ్యసభ చాన్స్‌ దక్కితే టీటీడీ చైర్మన్‌ పోస్టును వేరే వారితో భర్తీ చేస్తారని చెబుతున్నారు. 

విజయసాయిరెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మస్తాన్‌రావు:
ఇక, సీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు కూడా రేసులో ఉన్నారు. ఆయనకు శాసనమండలి చైర్మన్‌గా అవకాశం కల్పిద్దామని భావించినా.. ప్రస్తుతం మండలి రద్దయ్యే సూచనలు ఉండడంతో రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో అధిష్టానం ఉందని అంటున్నారు. గతంలో టీడీపీ హయాంలో ఉమ్మారెడ్డికి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. రాజ్యసభ సభ్యత్వ హామీతోనే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్‌రావు కూడా పోటీలో ఉన్నారు. ఆయనకు వైసీపీ సీనియర్‌ నాయకుడు విజయసాయిరెడ్డి అండ పుష్కలంగా ఉంది. కానీ, ఆయనకు ఎంత వరకూ అవకాశం ఇస్తారన్నది చూడాల్సిందే.

పవన్‌కు చెక్‌ చెప్పేందుకు చిరంజీవిని రంగంలోకి దించుతారా?
మరోపక్క, మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారట. చంద్రబాబు తనయుడు లోకేశ్‌పై పోటీ చేసి గెలిచినందున ఆర్కేకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, కొన్ని సమీకరణాల వల్ల ఆయనకు చాన్స్‌ దక్కలేదు. ఇప్పుడు దానిని భర్తీ చేసేందుకు ఆర్కే అన్నయ్య అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ ఇస్తారని అంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అయోధ్యరామిరెడ్డికి చాన్స్‌ దక్కవచ్చని చెబుతున్నారు. ఇక రేసులోకి అనూహ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి దూసుకొచ్చారు. జగన్‌ సర్కారు నిర్ణయాలకు మద్దతుగా మాట్లాడుతున్న చిరంజీవికి రాజ్యసభ బెర్త్‌ ఇవ్వడం ద్వారా ఆయన సోదరుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు చెక్‌ చెప్పవచ్చనే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.

కేంద్ర సర్కారులో చేరితే మరోసారి త్యాగాలు తప్పవా?
ఈ ఏడుగురిలో నలుగురికి చాన్స్‌ దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ అదే సమయంలో కేంద్రంలో ఎన్డీయే సర్కారులో వైసీపీ చేరే అవకాశాలున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీ తరఫున ఇద్దరు ఎంపీలకు కేంద్ర కేబినెట్‌లో చోటు ఇచ్చి… తమకు ఒక రాజ్యసభ సీటు తీసుకోవాలని ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ప్రతిపాదిస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. అదే జరిగితే మూడు సీట్లు మాత్రమే వైసీపీ మిగులుతాయి. మరి ఏడుగురిలో ఏ ముగ్గురికి ఆ అవకాశం దక్కుతుందనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఎన్డీయే చేరకపోతే నలుగురికి తప్పకుండా రాజ్యసభ బెర్త్‌ ఫిక్స్‌ అయిపోతుంది. కానీ, ప్రభుత్వంలో చేరితే మాత్రం మళ్లీ త్యాగాలు తప్పవని పార్టీ నేతలు అనుకుంటున్నారు.