జగన్ ప్రభుత్వం శాశ్వతం కాదని గ్రహించండి

Submitted on 21 October 2019
chandrababu fires on cm jagan

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నవరత్నాలు నవగ్రహాలుగా మారిపోయాయని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేసినప్పటి నుంచి ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు. అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టకొట్టారని.. ఇసుక విషయంలో అవినీతి జరిగిందన్న పేరుతో విమర్శలు చేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఇసుకాసురులుగా మారిపోయారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయటాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు మీ అబ్బ సొత్తు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మీ ముఖాలకు రంగులు పూసుకోండని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై వేధింపులు ఎక్కువయ్యాయని... సెర్చ్ వారెంట్ లేకుండా అఖిలప్రియ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని, పల్నాటి పులి కోడెలను అక్రమ కేసులు పెట్టి వేధించి చంపారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ సర్కార్ శాశ్వతం కాదని పోలీసులు గ్రహించాలని చంద్రబాబు అన్నారు.
 
హైదరాబాద్‌లో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోనే లక్షలాది మందికి ఉపాధి లభించిందని చంద్రబాబు చెప్పారు. టీడీపీది అభివృద్ధి రాజకీయం చేస్తే.. జగన్‌ చిల్లర, రౌడీ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇల్లు అలకగానే పండగ కాదని సీట్లు గెలిచినంత మాత్రాన సంబరం కాదని వైసీపీపై సెటైర్లు వేశారు. తాను ఏ తప్పు చేయలేదని... ఎవరికీ భయపడబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు.

పార్టీలో యువతకు 33 శాతం, మహిళలకు 33 శాతం పదవులు కేటాయిస్తామన్నారు. కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ఉంటే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేవని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తామంటే వైసీపీ నేతలు విమర్శలు చేశారని.. కానీ ఈ రోజు ఇసుక కొరతను తీర్చే పరిస్థితుల్లో లేరని చంద్రబాబు విమర్శించారు. దేశంలో ఇసుక ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే అని చెప్పారు. ఇసుకంతా ఎక్కడికి పోతోందని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖలో లారీ ఇసుక ఖరీదు లక్ష రూపాయలన్నారు. మన రాష్ట్రంలోని ఇసుకంతా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి తరలిపోతోందని ఆరోపించారు. ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో 32లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని చంద్రబాబు వాపోయారు. బంగారమైనా దొరుకుతుందేమో కానీ రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్థితి లేదన్నారు.

Chandrababu
cm jagan
ap govt
SAND
Police

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు