govt to give cow or buffalo for every home in telangana

చైనా నుంచి వెళ్లిపోయే కంపెనీలను భారత్‌కు రప్పించండి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ కీలక సూచనలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ మమమ్మారి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. చైనా పై ప్రపంచ దేశాలు ఒకింత కోపంగా ఉన్నాయి. దీనికి కారణం చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూడటమే. అక్కడ పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. ప్రజల ప్రాణాలు తీసింది. ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. దేశాలను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ కారణంగా చైనాపై అన్ని దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. చైనా సేఫ్ కాదని చాలా దేశాలు భావిస్తున్నాయి. అక్కడ కంపెనీలు పెట్టడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఆసక్తి చూపడం లేదు.

ఈ పరిణామం భారత్ కు కలిసి వచ్చే అంశం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలిగితే, చైనా నుంచి వెళ్లిపోయే కంపెనీలను భారత్ కు రప్పించగలిగితే మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే చెప్పారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ కేటీఆర్. చైనా నుంచి వెళ్లిపోయే కంపెనీలు భారత్ కు రప్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక సూచనలు కూడా చేశారు.

రాష్ట్రాల ఐటీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌:
ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ దేశీయ పరిశ్రమలు అనేక అవకాశాలను అందిపుచ్చుకొనే పరిస్థితులున్నాయని కేటీఆర్ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సహకార ధోరణితో వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రెండు ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లు (ఈఎంసీలు) నిండిపోయిన నేపథ్యంలో మరో రెండు ఈఎంసీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ మంగళవారం(ఏప్రిల్ 29,2020) ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

చైనా నుంచి వెళ్లిపోయే పరిశ్రమలను భారత్‌కు రప్పించేందుకు చర్యలు చేపట్టాలన్న కేటీఆర్:
కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, ఐటీ పరిశ్రమపై కొవిడ్‌-19 ప్రభావం, కొత్త టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై ప్రధానంగా  చర్చించారు. కొవిడ్‌-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని వర్క్‌ ఫ్రం హోం నిర్వర్తించేలా ఐటీ, బీపీవో సంస్థల సిబ్బందికి గతంలో కల్పించిన వెసులుబాటును జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు రవిశంకర్‌ప్రసాద్‌ వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్రానికి పలు కీలక సూచనలు చేశారు. చైనా నుంచి తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలిస్తున్నట్టు జపాన్‌ లాంటి దేశాలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ.. ఇలాంటి పరిశ్రమలను, ముఖ్యంగా ఐటీ సంబంధిత ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను భారత్‌కు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అలా చేయగలిగితే దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. 

జాతీయస్థాయి స్ట్రాటజీ గ్రూపు ఏర్పాటు చేయాలని సూచన:
లాక్‌డౌన్‌ తర్వాత వ్యాపార నిర్వహణపై వివిధ దేశాలు అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మేధావులతో స్ట్రాటజీ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నాయని  మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దేశీయ ఐటీ, అనుబంధ పరిశ్రమలకు సంబంధించి స్థానిక పారిశ్రామికవేత్తలు, నిపుణులతో జాతీయస్థాయి స్ట్రాటజీ గ్రూపును  ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని, ఈ విధానం  భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశమున్నందున సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపారు. దీనిపై  దృష్టిసారించాలని కేంద్రానికి సూచించారు.

బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలి:
ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలు విరివిగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరమున్నదని, ఈ విషయంలో కేంద్రం మరింత చొరవ చూపాలని అన్నారు. భారత్‌నెట్‌ ప్రాజెక్టుకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను వెంటనే అందజేయాలని సూచించారు. బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజెస్‌, ఫార్మా లాంటి రంగాల్లో అనేక అవకాశాలు ఉత్పన్నమవుతాయని, ఐటీ ఆధారిత రంగాల కలయికతో లభించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

ఈ-కామర్స్‌కు చేయూతనివ్వాలి:
లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాధారణ వస్తువులు మొదలుకొని వివిధ రకాల సేవలు, సదుపాయా లు ఈ-కామర్స్‌ రంగంలోకి వచ్చే అవకాశమున్నదని, దీన్ని  దృష్టిలో ఉంచుకొని ఈ రంగానికి సహాయం అందించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అనుబంధ రంగాల్లోని ఎమ్మెస్‌ఎంఈ కంపెనీలు  ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయని, వాటికి జీఎస్టీ, ఇతర పన్ను చెల్లింపుల్లో మినహాయింపులను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.  అమెరికా, యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలపై కొవిడ్‌-19 ప్రభావం వల్ల సమస్యలను ఎదుర్కొనే దేశీయ ఐటీ, అనుబంధ పరిశ్రమలను ఆదుకునేందుకు,  ఆయా పరిశ్రమల్లోని మానవ వనరులను ఇతర రంగాల్లోకి తరలించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి  కేటీఆర్‌ స్పష్టంచేశారు.

మంత్రి కేటీఆర్‌ సూచనలను పాటిస్తాం:
రాష్ట్రాల ఐటీ మంత్రులు ఇచ్చిన సూచనలను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ తెలిపారు. మంత్రి కేటీఆర్‌ సూచనల  మేరకు ఐటీ, అనుబంధ రంగాల కోసం స్ట్రాటజీ గ్రూపును ఏర్పాటుచేయడంతోపాటు ఇంటర్నెట్‌ సేవలను మరింత బలోపేతం చేసేలా భారత్‌నెట్‌  కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ-కామర్స్‌ రంగానికి మరింత చేయూతనిచ్చేందుకు చర్యలు చేపడుతామన్నారు. కేంద్రం  ప్రారంభించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కరోనా కట్టడికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు  చేపట్టిన ఆదర్శనీయ పద్ధతులు, కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు అనుసరించేందుకు మూడురోజుల్లోగా ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. 

మొత్తంగా చైనా నుంచి తరలిపోయే కంపెనీలను భారత్ రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరడం జరిగింది. అదే సమయంలో కేటీఆర్ సైతం ఆ పనిలోనే ఉన్నారు. చైనా నుంచి వెళ్లిపోయే కంపెనీలు తెలంగాణ వైపు అట్రాక్ట్ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణకు కంపెనీలు, పెట్టుబడులు రాబట్టే దిశగా కేటీఆర్ కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు స్వయంగా టెన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలిపారు.

Related Posts