కేంద్రానికి మిత్రపక్షం షాక్.. ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా బీహార్‌ అసెంబ్లీ తీర్మానం

Submitted on 26 February 2020
Bihar assembly passes unanimous resolution on NPR, NRC

మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాక్ ఇచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. ఎన్ఆర్సీకి(National Register Of Citizens) వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన క్రమంలో బీహార్‌లో ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ మంగళవారం(ఫిబ్రవరి 25,2020) తీర్మానం ఆమోదించింది. అంతేకాదు జాతీయ పౌరపట్టిక (ఎన్‌పీఆర్‌)ను 2010లో ఉన్న ఫార్మాట్ లోనే అమలు చేస్తామని సీఎం నితీష్ తేల్చి చెప్పారు. స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ చౌదరి ఈ తీర్మానాన్ని సభ ముందుంచగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బీహార్‌లో ఎన్‌ఆర్‌సీ అవసరం లేదని, ఎన్‌పీఆర్‌ను 2010 ఫార్మాట్‌లో కేంద్రం అమలు చేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు.

తీర్మానం ఆమోదానికి ముందు బీహార్‌ అసెంబ్లీలో పాలక ఎన్డీయే సభ్యులు, విపక్ష సభ్యుల మధ్య ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ అంశాలపై తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను విపక్ష నేత తేజస్వి యాదవ్‌ నల్ల చట్టాలుగా అభివర్ణించారు. వీటిపై సీఎం తీష్‌ కుమార్‌ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నూతన చట్టాలు దేశాన్ని మతపరంగా విభజిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్‌ వ్యాఖ్యలను పాలక సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. విపక్ష నేత రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్ల చట్టాలను పార్లమెంటు ఆమోదించగలదా? అని ప్రశ్నించారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు.

తాజాగా కేంద్రం తీసుకొచ్చిన ఎన్పీఆర్‌లో కొన్ని వివాదాస్పద నిబంధనలున్నాయని, వాటిని కేంద్రం తొలగించాలని కేంద్రానికి నితీష్ సూచించారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాసినట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతు తెలిపిన బీహార్ సీఎం నితీష్.. మొదట్నుంచి ఎన్ఆర్‌సీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అసెంబ్లీలో ఎన్ఆర్‌సీకి వ్యతిరేక తీర్మానం చేశారు. ఎన్పీఆర్ మాత్రం రాష్ట్రంలో పాత నమూనాలో అమలు చేస్తామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్ కాలమ్ కూడా ఎన్పీఆర్ ఫాంలో పొందుపరుస్తామని తెలిపారు.

BIHAR
Assembly
Passes
unanimous resolution
NPR
NRC
caa
Modi
BJP
Nitish Kumar
JDU
bihar assembly

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు