భయంకరమైన నిజం : నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లతో అంబులెన్స్‌లు నడిపేస్తున్నారు

Submitted on 23 April 2019
Bandra police bust fake driving licence racket

ముంబైలో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. ఈ కేసు దర్యాఫ్తులో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఒక్కొక్కటిగా బయటపడుతున్న నిజాలు వారికి దిమ్మతిరిగిపోయేలా చేస్తున్నాయి. ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ లు తీసుకున్న వారు ఏకంగా అంబులెన్సులు నడిపేస్తున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. గత వారం బాంద్రా పోలీసులు బోగస్ డ్రైవింగ్ లైసెన్స్ స్కామ్ ను గుర్తించారు. అతి వేగంగా వెళ్తున్న ఓ అంబులెన్స్ ని ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. డ్రైవర్ ని ప్రశ్నించడంతో నిజం వెలుగులోకి వచ్చింది.

అతడి పేరు మనోజ్ శివ ప్రకాశ్ కుమార్. అతడి నుంచి పోలీసులు ఆరు నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ బాంద్రాలో నివాసి. రెడ్ సిగ్నల్ పడినా అంబులెన్స్ ని అలాగే పోనిచ్చాడు. అందులో పేషేంట్ కూడా లేడు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే మరో సిగ్నల్ దగ్గర ఆ అంబులెన్స్ ని పట్టుకున్నారు. లైసెన్స్ చూపించమని డ్రైవర్ ని పోలీసులు అడిగారు. అతడి డ్రైవింగ్ లైసెన్స్ చూడగానే అనుమానాలు బలపడ్డాయి. డాక్యుమెంట్ లో ఉన్న ఫొటోకి అతడి ఫేస్ కి మ్యాచ్ కాలేదు. దీంతో అది ఫేక్ అని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అతడిని సోదా చేస్తే ఆరు నకిలీ లైసెన్స్ లు దొరికాయి. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. గ్యాంగ్ హెడ్ కోసం వేట మొదలు పెట్టారు.

విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. ఏప్రిల్ లో ఇలా 12 ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ లు అమ్ముకున్నారు. ఒక్కొక్కటి రూ.7వేలకు విక్రయించారు. వాటిని కొనుగులో చేసిన వారిలో చాలామంది అంబులెన్స్ డ్రైవర్ల అవతారం ఎత్తారు. సాధారణంగా అంబులెన్సులను ట్రాఫిక్ పోలీసులు ఆపరు. అందులో పేషెంట్స్ ఉంటారని, ఎమర్జెన్సీ యాంగిల్ లో చూస్తారు. దీన్ని కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. టెక్నికల్ గా ఎలాంటి అర్హత లేకున్నా ఫేక్ లైసెన్స్ లతో అంబులెన్స్ డ్రైవర్లుగా మారిపోతున్నారు. పేషెంట్ల ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు.

అంబులెన్స్ డ్రైవర్ పై ఎంతో బాధ్యత ఉంటుంది. పేషెంట్ల ప్రాణాలు అతడి చేతిలో ఉంటాయి. డ్రైవింగ్ మీద పట్టున్న వారినే అంబులెన్స్ డ్రైవర్లుగా అపాయింట్ చేసుకుంటారు. అలాంటిది.. డ్రైవింగ్ రాకపోయినా, ఎలాంటి అర్హత లేకపోయినా.. ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ లతో కొందరు అంబులెన్స్ డ్రైవర్లుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ స్కాం కలకలం రేపింది. నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ తో అంబులెన్స్ డ్రైవర్లుగా పని చేస్తున్న వారి భరతం పట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

Bandra police
bust
fake driving licence racket

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు