ఈ మేలు మరువం...భారత్ కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్

Submitted on 9 April 2020
Will not be forgotten: Donald Trump thanks India, PM Modi for supplying hydroxychloroquine to US

భారత్ పై,ప్రధాని మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పై,మోడీపై ప్రశంసలు కురిపిస్తూ ట్రంప్ గురువారం ఓ ట్వీట్ చేశారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం. థ్యాంక్యూ ఇండియా. హైడ్రాక్సీక్లోరో​క్విన్‌పై భారత ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు. ఈ మేలు మర్చిపోం!భారత్‌ను ముందుకు నడిపించే మీ బలమైన నాయకత్వంతో భారత్ కు మాత్రమే సహాయం కాదు, ఈ యుద్ధంలో మానవతా దృక్పథం అవలంబిస్తున్న తీరుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు అంటూ అమెరికా అధ్యక్షుడు భారత్‌ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నారు.

కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడంలో సత్ఫలితాలను ఇస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేసినందుకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ ట్వీట్‌ చేశారు. కాగా కరోనాతో అల్లాడుతున్న దేశాలకు మానవతా దృక్పథంతో అత్యవసరమైన మందులు సరఫరా చేస్తామని భారత్‌ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనాతో అతలాకుతలం అవుతున్న అమెరికాకు దాదాపు 29 మిలియన్‌ డోసుల డ్రగ్స్‌ను ఎగుమతి చేసింది.

ఈ నేపథ్యంలో బుధవారం వైట్ హౌస్ లో ట్రంప్‌ మాట్లాడుతూ....సమస్యలు తలెత్తిన తరుణంలో మా అభ్యర్థనను మన్నించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. ఆయన అద్భుతమైన వ్యక్తి. చాలా మంచోడు,గేట్ర్, మేము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం అని అన్నారు. తమకు యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ట్రంప్‌ మొదట హెచ్చరించిన విషయం తెలిసిందే.

ప్రపంచంలోని హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరాలో 70 శాతం (200 మి.గ్రా చొప్పున సుమారు 20 కోట్ల మాత్రలు) భారతదేశం ఒక్కటే తయారు చేస్తుంది. కరోనా వైరస్(COVID-19) కేసులకు సాధ్యమైన చికిత్సగా యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ మెడిసిన్ ను గుర్తించింది. చైనా,దక్షిణ కొరియా ఇలా ప్రపంచంలోని చాలా దేశాలకు కరోనా వైరస్ ట్రీట్మెంట్ కు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఉపయోగిస్తున్నాయి.భారత్ కూడా కరోనా ట్రీట్మెంట్ లో ఈ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తుంది.

అయితే మార్చి-25న భారత్...ఇతర దేశాలకు ఈ ట్యాబ్లెట్ల సప్లయ్ ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే మానవత్వం దృష్ట్యా ఈ ట్యాబ్లెట్లను అవసరమైన దేశాలకు ఎగుమతి చేస్తామని మంగళవారం భారత్ ప్రకటించింది. ఇక హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాల్సిందిగా అమెరికాతో పాటు బ్రెజిల్‌ సహా 30 దేశాలు భారత్‌ను అభ్యర్థించాయి. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికాకు సదరు మాత్రలు సరఫరా చేసిన భారత్‌.. బ్రెజిల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా తన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించినందుకు ఆ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను..లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు ఆంజనేయస్వామి తీసుకొచ్చిన సంజీవనితో పోల్చారు బ్రెజిల్ అధ్యక్షుడు.

ఇక మహమ్మారి కరోనా సోకి అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 14 వేల 797 మంది చనిపోయారు. 4లక్షల 35వేల 160 మంది ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కాగా కరోనాతో అమెరికాలో మృతి చెందిన భారతీయుల సంఖ్య 11కు చేరినట్లు సమాచారం.

Also Read |  ఇది నిజంగా గుడ్ న్యూస్, ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు

trump
india
hydroxy chloroquine
supply
thanks
forgetten
not
Modi
usa
covid19
fight
coronavirus
ANTI MALARIA DRUG

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు